Adani | న్యూఢిల్లీ, నవంబర్ 22: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికా నేరారోపణలు.. యావత్తు భారతీయ వ్యాపార-పారిశ్రామిక రంగాల పరపతినే దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోలార్ పవర్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి లంచాలు, తప్పుడు ప్రకటనలతో నిధుల సమీకరణలు, అంతర్జాతీయ మదుపరులను మోసగించారన్న ఆరోపణలు అదానీ, ఆయన సంస్థలు, ఉన్నతోద్యోగులపై వచ్చాయి. అదానీ గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా భావించే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, దాని ప్రాజెక్టుల్లోనే ఈ అవకతవకలు చోటుచేసుకోగా.. గత రెండున్నర దశాబ్దాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ అనుచరుడిగా కూడా అదానీ ఉండటంతో ఇప్పుడు రాజకీయాల్లోనూ ఈ కేసు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అదానీ వ్యవహారం విదేశీ సంస్థాగత మదుపరులలో (ఎఫ్ఐఐలు) గుబులు రేపుతున్నది. దేశీయ వ్యాపార-పారిశ్రామికవేత్తల అవినీతి బాగోతాలు, ఇక్కడి నిబంధనల ఉల్లంఘనలు, రెగ్యులేటరీ వ్యవస్థల్లోని లోపాలపై విదేశీ మదుపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మోసం చేసి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన ఘటనలు కార్పొరేట్ భారతంలో కోకొల్లలు. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌పై గత ఏడాది హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఆరోపణలు, ఇప్పుడు అమెరికా నేరారోపణలు.. విదేశీ ఇన్వెస్టర్లను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అదానీపై అమెరికా ఏకంగా అరెస్ట్ వారెంట్నే జారీ చేయడం.. అదానీ సంస్థకేగాక, మొత్తం భారతీయ పరిశ్రమకే మచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌పై విశ్వాసం సన్నగిల్లడం ఖాయమన్న ఆందోళనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి.
అదానీ గ్రూప్‌లోని అతిపెద్ద మదుపరులలో ఒకటైన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్.. షేర్ల బైబ్యాక్‌కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై అమెరికాలో తీవ్ర నేరారోపణల కేసు నమోదైన నేపథ్యంలో జీక్యూజీ షేర్ బైబ్యాక్‌కు ప్రాధాన్యత ఏర్పడుతున్నది. ఈ కేసు దెబ్బకు గురువారం ఒక్కరోజే గ్రూప్ మార్కెట్ విలువ భీకర స్థాయిలో కరిగిపోయిన విషయం తెలిసిందే. జీక్యూజీ షేర్ల విలువ కూడా 19 శాతం హరించుకుపోయింది. ఈ నేపథ్యంలోనే మరిన్ని నష్టాలను అడ్డుకునేలా సొంత షేర్లను తిరిగి ఇన్వెస్టర్ల నుంచి కొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు. గత ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రిసెర్చ్ రిపోర్టుతో కుదేలైన అదానీ గ్రూప్‌నకు జీక్యూజీ దన్నుగా నిలిచింది. రూ.80,000 కోట్లతో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లలో పెట్టుబడులు పెట్టింది.
సెబీ దర్యాప్తు..
అదానీపై అమెరికాలో కేసుకు సంబంధించి భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తు చేస్తున్నది. అయితే ఇప్పటికైతే ఈ వ్యవహారంలో మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా? అన్న కోణంలోనే సెబీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. మార్కెట్‌ను ప్రభావితం చేసే ఈ అమెరికా నేరారోపణల అంశాన్ని నిబంధనల ప్రకారం తెలియపర్చిందా? అని స్టాక్ ఎక్సేంజీల ద్వారా సెబీ కనుక్కుంటున్నది. కాగా, రెండు వారాల్లో ఈ కేసుపై మరింత లోతుగా విచారణకు సెబీ నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తెలుస్తుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తాజా కేసు.. అదానీ కంపెనీల్లో పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, ఎస్అండ్పీ అంటున్నాయి.
వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ తమ డాలర్ బాండ్ల విక్రయ యోచనను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసు నేపథ్యంలో వేదాంత నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. బాండ్ల జారీ ద్వారా 600 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని వేదాంత భావించింది. ఇందుకు సర్వం సిద్ధమైంది కూడా. కానీ ఇప్పుడు వెనక్కితగ్గింది. బాండ్ల అమ్మకం ఎప్పుడు? ఉంటుందన్నది త్వరలోనే తెలియజేస్తామని కంపెనీ చెప్తున్నది. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులే కారణమని అంటున్నారు. అదానీ కేసు నేపథ్యంలో బాండ్లకు పెద్దగా ఆదరణ ఉండదనే ఈ నిర్ణయానికి వచ్చారా? అన్న సందేహాలున్నాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అజుర్ పవర్.. అప్పట్లో ఈ సోలార్ పవర్ డీల్‌ను ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొన్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల (రూ.45,000 కోట్లు) విలువైన ప్రాజెక్టును గెల్చుకున్నట్టు 2020లో అదానీ గ్రూప్ ప్రకటించింది. దీన్నుంచి పన్ను అనంతర లాభం 2 బిలియన్ డాలర్లపైనే (దాదాపు రూ.16,000 కోట్లు) ఉండొచ్చన్న అంచనాలనూ వేసింది. ఈ ప్రాజెక్టుతో 4 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని, 900 మిలియన్ టన్నుల కార్బ న్ డైయాక్సైడ్కూ చెక్ పెట్టినట్టు అవుతుందని అదానీ పేర్కొన్నట్టు అమెరికా ప్రాసిక్యూటర్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే లంచాలు ఇచ్చైనాసరే ప్రాజెక్టును దక్కించుకోవాలని చూశారన్న వాదనలు వినిపిస్తున్నాయిప్పుడు.