ముంబై, ఆగస్టు 12: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద రూ.28 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఓ తాజా నివేదిక తేల్చింది. గౌతమ్ అదానీ కుటుంబ సంపద కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అదానీ కుటుంబ ఆస్తులు రూ.14.01 లక్షల కోట్లుగా ఉన్నట్టు బార్క్లేస్తో కలిసి మంగళవారం హురున్ తెచ్చిన నివేదికలో వెల్లడైంది. ఇక గత ఏడాది అంబానీ కుటుంబ సంపద 10 శాతం పెరిగింది. దీంతో భారతీయ అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా తన స్థానాన్ని అంబానీ ఫ్యామిలీ నిలబెట్టుకున్నది.
అయితే తండ్రి ధీరూభాయ్ అంబానీ ద్వారా ముకేశ్ అంబానీ కుటుంబ సంపద వారసత్వంగా మొదలైన నేపథ్యంలో తొలి తరం ఆంత్రప్రెన్యూర్ సంపన్న కుటుంబాల్లో గౌతమ్ అదానీ ఫ్యామిలీయే అగ్రస్థానంలో ఉన్నది. ఇదిలావుంటే కుమార మంగళం బిర్లా కుటుంబ సంపద మునుపటితో పోల్చితే నిరుడు 20 శాతం పుంజుకొని రూ.6.47 లక్షల కోట్లుగా ఉన్నది. జిందాల్ కుటుంబ ఆస్తులూ 21 శాతం ఎగిసి రూ.5.70 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫలితంగా బహుళ తరాల సంపన్న కుటుంబాల జాబితాలో అటు బిర్లా, ఇటు జిందాల్ ఫ్యామిలీల ర్యాంకులు ఒక్కో స్థానం ఎగబాకాయి. అయితే బజాజ్ కుటుంబ సంపద 21 శాతం పడిపోయి రూ.5.64 లక్షల కోట్లకు పరిమితమైంది.