Amazon Quick Commerce | దేశీయంగా క్విక్ కామర్స్ బిజినెస్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. దీంతో పలు సంస్థలు క్విక్ కామర్స్ సేవలు అందించడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సైతం ఈ జాబితాలోకి వచ్చి చేరుతోంది. ఈ నెలాఖరులోగా క్విక్ కామర్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. తొలుత బెంగళూరు నగర వాసులకు ఈ సర్వీసులు అందిస్తామన్నారు. క్విక్ కామర్స్ సేవల్లో వెయ్యి నుంచి రెండు వేల ఉత్పత్తులను కస్టమర్లకు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే మున్ముందు ఇతర నగరాలకు క్విక్ కామర్స్ సేవలు విస్తరిస్తామని చెప్పారు.
క్విక్ కామర్స్ అంటే.. ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లో కస్టమర్లకు డోర్ డెలివరీ చేయడం. ఈ రంగంలోకి అమెజాన్ ఎంటర్ కావడం ఇదే ప్రథమం. వచ్చే ఏడాది క్విక్ కామర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని మొదట భావించిన అమెజాన్.. రోజురోజుకు కొత్త సంస్థలు వచ్చి చేరుతుండటంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్విక్ కామర్స్ సేవల కోసం అమెజాన్.. ప్రత్యేకంగా సిబ్బంది నియామకం చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్ కార్ట్ కూడా క్విక్ కామర్స్ సేవలు ప్రారంభించాయి. రిలయన్స్, టాటా సన్స్ కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధం అవుతున్నాయి.