న్యూయార్క్ : పదివేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా కొలువుల కోతకు మరో మార్గాన్ని ఎంచుకుంది. స్వచ్ఛందంగా కంపెనీని వీడాలని కొందరు ఉద్యోగులను అమెజాన్ కోరుతున్నట్టు సమాచారం. పలు విభాగాల్లోని కొందరు ఉద్యోగులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆఫర్లు ముందుకు తెచ్చిందని తెలిసింది.
కంపెనీని విడిచివెళ్లేందుకు సిద్ధమైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌ను మూడు నెలల్లో అమెజాన్ చెల్లిస్తుందని ఓ వార్తాసంస్ధ పేర్కొంది. అమెజాన్‌లో ఉద్యోగులు పనిచేసిన ప్రతి ఆరు నెలలకు ఓ వారం వేతనం చొప్పున కంపెనీ పరిహారం కింద అందచేస్తుంది. 12 వారాలకు వీక్లీ స్టైఫండ్ కూడా చెల్లిస్తుంది. ఈ సంవత్సరాంతం వరకూ ఉద్యోగులు ఇన్సూరెన్స్ పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
స్వచ్చందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులు నవంబర్ 29లోగా నిర్ణయం తీసుకోవాలని కంపెనీ కోరింది. స్వచ్ఛంద రాజీనామాల ఆమోదంపై కంపెనీ ఉద్యోగులకు సమాచారం అందిస్తుంది. ఇక వ్యయ నియంత్రణ పేరుతో అమెజాన్ పెద్దఎత్తున మాస్ లేఆఫ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. అలెక్సా వాయిస్ అసిస్టెంట్, రిటైల్ డివిజన్, హెచ్ఆర్ విభాగాల్లో పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తోంది.