Royal Enfield Flying Flea C6 | ఆకాశాన్నంటే రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి.. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్ – డీజిల్ లకు ప్రత్యామ్నాయ ఇంధనంతో ప్రత్యేకించి ఎలక్ట్రిక్ తో నడిచే వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. కార్లు, ఆటోలు, స్కూటర్లలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేస్తున్నాయి. ఆ బాటలో
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) చేరింది. తాజాగా భారత్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ప్రదర్శించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) అనే బ్రాండ్ తో తీసుకొచ్చింది.
1940వ దశకంలోని రాయల్ ఎన్ ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ మోటారు సైకిల్ స్పూర్తితో ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) ఎలక్ట్రిక్ బైక్ ప్రదర్శించింది. ఈ బైక్‌కు రౌండ్ ఎల్ఈడీ హెడ్ లైట్, ఫ్రంట్‌లో రిర్డర్ ఫోర్క్ ఉంటాయి. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ తో వస్తున్న ఈ విద్యుత్ బైక్‌లో రెండు సీట్ల వర్షన్లు వస్తాయని సమాచారం. ఇక టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100-150 కిమీ దూరం ప్రయాణించొచ్చు. తాము మార్కెట్లో ఆవిష్కరించే విద్యుత్ మోటారు సైకిళ్లన్నీ ‘ఫ్లయింగ్ ఫ్లీ’ బ్రాండ్ కింద తీసుకొస్తున్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ వెల్లడించింది. అయితే ఈ మోటారు సైకిల్లో వాడే ఫీచర్లు, ధర తదితర వివరాలు వెల్లడించలేదు. 2026లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 మోటారు సైకిల్ మార్కెట్లోకి తేవడానికి చర్యలు ప్రారంభించింది.