న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్.. బుధవారం బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎస్ఐఎఫ్) అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2047కల్లా అందరికీ బీమాతోపాటు ప్రధాన మంత్రి ‘వికసిత్ భారత్ 2047’ మిషన్ లక్ష్యాల సాధనలో భాగంగా దీన్నో ముందడుగుగా ఓ ప్రకటనలో ఐఆర్డీఏఐ పేర్కొన్నది. పాలసీదారుల సాధికారతకు కృషి చేస్తున్నట్టు అజయ్ సేథ్ ఇందులో తెలిపారు. అందరికీ బీమా ప్రయోజనాలు అందేలా, ఎక్కడా పారదర్శకత లోపించకుండా కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఒకే వేదికపై అన్నిరకాల బీమా సేవలను పాలసీదారులకు అందించేలా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్టు అజయ్ సేథ్ వివరించారు. వివిధ సంస్థలు అందిస్తున్న విస్తృత శ్రేణి జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ఎంపిక, కొనుగోలు దగ్గర్నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్, రెన్యువల్దాకా కేవలం పాలసీ నెంబర్‌ను వినియోగించి ఎలాంటి పత్రాలు లేకుండానే సులువుగా పనిని పూర్తిచేసుకోవచ్చు.