Akasa Air | ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్.. క్రిస్మస్ సందర్భంగా కస్టమర్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ చేసింది. దేశీయ రూట్లలో టికెట్లపై రూ.1,499 (వన్ వే – One Way) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల 24 నుంచి 26 మధ్య ‘సేవర్’, ‘ఫ్లెక్సీ’ ధరలపై టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 2025 జనవరి ఏడో తేదీ నుంచి విమాన యానం చేసే వారు ఈ డిస్కౌంట్లు పొందొచ్చు. నాన్ స్టాప్, ఆకాశ ఎయిర్ నెట్ వర్క్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా, వన్ వే, రౌండ్ ట్రిప్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఆకాశ ఎయిర్ వెబ్ సైట్ (www.akasaair.com), మొబైల్ యాప్, ట్రావెల్ పార్టనర్లతోపాటు అన్ని చానెల్స్లోనూ విమాన టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ‘హాలీడే25 (HOLIDAY25)’ కోడ్ ఉపయోగిస్తే 25 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ప్రస్తుతం ఆకాశ ఎయిర్ 22 దేశీయ, ఐదు విదేశీ నగరాల మధ్య విమాన సర్వీసులు నడుపుతున్నది.
దేశీయంగా ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కోచి, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణె, లక్నో, గోవా, హైదరాబాద్, వారణాసి, బాగ్దొర, భువనేశ్వర్, కోల్ కతా, పోర్ట్ బ్లయర్, అయోధ్య, గ్వాలియర్, శ్రీనగర్, ప్రయాగ్ రాజ్, గోరఖ్ పూర్ తోపాటు దోహా (ఖతార్), సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబి, కువైట్ సిటీలకు విమాన సర్వీసులు నడుపుతోంది.