న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మాధవీ పురీ బచ్ అన్నారు. అదానీ గ్రూప్ అక్రమాల్లో బచ్ దంపతులకూ భాగస్వామ్యం ఉందంటూ అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెబీ చీఫ్‌పై వరుస విమర్శలు వ్యక్తమవగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం అవినీతి ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం భర్త ధవల్ బచ్‌తో కలిసి మాధవీ పురీ బచ్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో మహీంద్రా గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ మరికొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి చెల్లింపులు జరిగాయన్నదానిపైనా స్పష్టత ఇచ్చారు.
ఏ కంపెనీతో కూడా మార్గదర్శకాలు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్లలేదని చెప్పారు. 2017లో సెబీ బోర్డులోకి వచ్చాక కూడా అగోరా అడ్వైజరీ, అగోరా పార్ట్నర్స్ నుంచి ఆర్జించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ రెండింటికి సంబంధించిన ఏ వ్యవహారంలోనూ తలదూర్చలేదని వెల్లడించారు. సెబీలో తానున్నప్పుడు తన భర్త పనిచేసిన మహీంద్రా గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్వరేజ్, మర్సల్, సెంబ్‌కార్ప్ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదన్నారు. ఇక తాను గతంలో పనిచేసిన ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కాంట్రిబ్యూటరీ యాన్యుటీ స్కీం, ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలకు సంబంధించిన చెల్లింపులనే తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు.