హైదరాబాద్, జనవరి 23: ఆర్గానిక్ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్..జడ్చర్లలో ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నది. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నదని, ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు ఈ యూనిట్లో రోజు 40 వేల లీటర్ల పాలు ప్రాసెసింగ్ కానున్నదని కంపెనీ ఫౌండర్, సీఈవో శశి కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో ఆర్గానిక్ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ను నెలకొల్పుతున్నట్లు, దీంతో ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ.480 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 65కి పైగా రైతుల నుంచి పాల ఉత్పత్తులను సేకరిస్తున్నట్లు, వచ్చే మూడేండ్లలో 385కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.