Airtel Down | భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ మరోసారి మొరాయించింది. ఈ సారి బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో ప్రభావం కనిపించింది. ఈ నెల 8న ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్టెల్, జియో నెట్వర్క్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాంతో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలు స్తంభించాయి. డౌన్‌డెటెక్టర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో ఫిర్యాదులు వచ్చాయి. 7,100 మందికి పైగా వినియోగదారులు ఎయిర్టెల్ నెట్వర్క్ పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఎయిర్టెల్ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ ఎయిర్టెల్ కేర్స్ ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తాత్కాలిక కనెక్టివిటీ సమస్య’గా పేర్కొంది. సమస్యను గంటలోగా పరిష్కారమవుతుందని పేర్కొంది.
యూజర్లు తమ మొబైల్స్‌ను రీ స్టార్ట్ చేయాలని కంపెనీ సూచించింది. ఎయిర్ ట్వీట్లో ‘ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. ఈ సమస్య తాత్కాలిక కనెక్టివిటీ అంతరాయం కారణంగా జరుగుతుంది. దాదాపు ఒక గంటలో పరిష్కారమవుతుంది. మీ మొబైల్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయండి’ అని పేర్కొంది. నెట్‌వర్క్‌లో అంతరాయంపై సోషల్ మీడియా వేదికగా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు బెంగళూరులో ఎయిర్టెల్ ఇంటర్నెట్ నిలిచిపోయింది. కంపెనీ వినియోగదారులకు ముందుగానే తెలియజేయకూడదా?’ అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. మరొక యూజర్ ‘గత 6 గంటలుగా ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ సేవలు నిలిచిపోయాయి. కాల్స్ రావడం లేదు. ఇంటర్నెట్ కూడా స్తంభించింది. కస్టమర్ కేర్ నుంచి కూడా స్పందన లేదు. దీనిపై TRAI చర్య తీసుకోవాలి’ అంటూ డిమాండ్ చేశాడు.