టెండర్లను తెరిచిన మెట్రో అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ ముగిసింది. ఎల్అండ్టీ, ఎన్సీసీ బరిలో నిలిచాయి. ఈ నిర్మా ణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ గత నెల నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో ఎల్అండ్టీ, ఎన్సీసీతోపాటు టాటా ప్రాజెక్ట్స్, సిమెన్స్, ఆల్స్టామ్ తదితర 13 దేశ, విదేశీ సంస్థలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఇక్కడి మెట్రో భవన్లో అధికారులు టెండర్లను తెరిచారు. కాగా, తొలుత ఎల్అండ్టీ, ఎన్సీసీ కంపెనీల టెక్నికల్ బిడ్లను పరిశీలించి, ఫైనాన్షియల్ బిడ్ల ఆధారంగా నిర్మాణ పనులు అప్పగించనున్నారు.
నిర్మాణ వ్యయాన్ని తక్కువగా చూపిన కంపెనీకే నిర్మాణ బాధ్యతలు దక్కుతాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక ఎల్అండ్టీ, ఎన్సీసీ బిడ్లను నిపుణుల కన్సల్టెంట్ల బృందం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ల బృందం పరిశీలించి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నాయి. కంపెనీ మ్యాన్ పవర్, యంత్ర పరికరాలు, నిర్మాణ పద్ధతులు, కాలవ్యవధి, డిజైనింగ్తోపాటు నిర్మాణానికి అసవరమైన విధివిధానాలతో కూడిన పత్రాలను కంపెనీలు సమర్పించాయని ఎన్వీఎస్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.