Airfare Spike | న్యూఢిల్లీ, ఆగస్టు 19: విమాన చార్జీలు పెరుగుతున్నాయి. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ఇప్పటికే ఏకంగా 25 శాతం వరకు టికెట్ ధరలను వివిధ విమానయాన సంస్థలు పెంచేశాయి. ఒక్కసారిగా పెరిగిన ముందస్తు బుకింగ్‌లే కారణం. ఈ క్రమంలోనే వన్-వే టికెట్ సగటు ధర దీపావళికి ఆయా ప్రధాన మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు పెరిగింది. ఇక ఓనమ్ పండుగకైతే కేరళ వెళ్లేవారు 20 నుంచి 25 శాతందాకా అధిక చార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి వస్తున్నది. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో వివరాల ప్రకారం ఢిల్లీ-చెన్నై నాన్‌స్టాప్ విమానం ఎకానమీ క్లాస్ టిక్కెట్ సగటు ధర అక్టోబర్ 30-నవంబర్ 5 మధ్య 25 శాతం ఎగిసి రూ.7,618గా ఉంటున్నది.
గత ఏడాది నవంబర్ 10-16 నడుమ రూ.5,713గానే ఉండటం గమనార్హం. అలాగే ముంబై-హైదరాబాద్ రూట్లో టికెట్ ధర 21 శాతం ఎగబాకి రూ.5,162 పలుకుతున్నది. ఢిల్లీ-గోవా, ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గాల్లో ధరలు రూ.5,999, రూ.4,930గా ఉంటున్నాయి. నిరుడుతో చూస్తే 19 శాతం ఎక్కువ. ఇతర మార్గాల్లోనూ టికెట్ రేట్లు 1 నుంచి 16 శాతం మేర పెరిగిపోయాయని చెప్తున్నారు. గత ఏడాది ఆగస్టు 20-29 మధ్య ఓనమ్ పండుగ జరిగినప్పటితో చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 6-15 మధ్య ఓనమ్ సమయంలో హైదరాబాద్-తిరువనంతపురం విమాన టికెట్ ధర 30 శాతం ఎగిసి రూ.4,102కి చేరింది. ముంబై-కాలీకట్ ఫ్లైట్ చార్జీ కూడా ఇంతే స్థాయిలో పెరిగి రూ.4,448గా నమోదైంది.
తగ్గిన బెంగళూరు-హైదరాబాద్ చార్జీ
మరోవైపు కొన్ని మార్గాల్లో విమాన చార్జీలు కనిష్టంగా 1 శాతం, గరిష్ఠంగా 27 శాతం తగ్గాయి. వాటిలో అత్యధికంగా ముంబై-అహ్మదాబాద్ టికెట్ ధర 27 శాతం క్షీణించి రూ.2,508గా ఉన్నది. అలాగే ముంబై-ఉదయ్‌పూర్ ఫ్లైట్ చార్జీ 25 శాతం పడిపోయి రూ.4,890కి దిగింది. బెంగళూరు-హైదరాబాద్ విమాన చార్జీ 23 శాతం తగ్గి రూ.3,383కు, ముంబై-జమ్ము టికెట్ రేటు 21 శాతం పతనమై రూ.7,826కు వచ్చాయి. రాబోయే పండుగ సీజన్లోనైతే కొన్ని రూట్లలో టికెట్ ధరలు దాదాపు 6-35 శాతం పడిపోవచ్చంటున్నారు. ఈ రూట్లలో డిమాండ్ పెంచేందుకేనని చెప్తున్నారు.
విమాన ప్రయాణీకుల రద్దీ..
ఈ ఏడాది జూలైలో గత ఏడాదితో పోల్చితే దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 7.3 శాతం పెరిగింది. 1.29 కోట్లకుపైగా విమానాలెక్కారు. అయి తే ఈ ఏడాది జూన్‌తో చూస్తే మాత్రం జూలైలో ప్రయాణీకులు తగ్గారు. నాడు 1.32 కోట్ల ప్రయాణీకులు నమోదయ్యారు. ఇక ఇండిగో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మార్కెట్ వాటా జూలైలో 62 శాతానికి ఎగిసింది. ఎయిర్ ఇండియా 14.3 శాతానికి తగ్గింది. ఆకాశ ఎయిర్ 4.7 శాతానికి, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతానికి, స్పైస్‌జెట్ 3.1 శాతానికి, అలయన్స్ ఎయిర్ 0.9 శాతానికే పరిమితమయ్యాయి. అయితే విస్తారా 10 శాతానికి పెరిగిందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరి-జూలైలో దేశీయ ఎయిర్‌లైన్స్‌ల్లో ప్రయాణీకుల సంఖ్య 92.33 కోట్లుగా ఉన్నది. పోయినసారి 88.19 కోట్లే. జూలైలో విమానాల ఆలస్యంతో 3 లక్షలకుపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ-చెన్నై, ముంబై-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్ వంటి రద్దీ మార్గాల్లో వన్-వే చార్జీలు సగటున రూ.4,000-5,000 మధ్య ఉన్నాయి. పండుగల దృష్ట్యా నిరుడుతో పోల్చితే 10-15 శాతం పెరిగాయి. ఓనమ్ పండుగకైతే ఈసారి కేరళ వెళ్లేవారు చాలాచాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. సెప్టెంబర్ రెండో వారంలో చాలామంది టిక్కెట్ బుక్ చేసుకుంటున్నారు. నిరుడుతో పోల్చితే రెట్టింపైంది. కొచ్చిన్, కాలీకట్, తిరువనంతపురం మార్గాల్లో విమాన చార్జీలు 20-25 శాతం ఎగిశాయి.
-రజ్నీశ్ కుమార్, ఇక్సిగో గ్రూప్ కో-సీఈవో