Air India – Air Bus |ప్రముఖ సుదూరపు రూట్ల (ఆల్ట్రా లాంగౌల్ రూట్లు)లో ఎయిర్ బసు ఏ350 విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా శుక్రవారం తెలిపింది. న్యూఢిల్లీ-న్యూయార్క్ మార్గంలో ఎయిర్ బస్ ఏ350 విమాన సర్వీసు ప్రారంభించింది. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకూ అమెరికాలోని వివిధ కేంద్రాలకు 60 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో న్యూఢిల్లీ- న్యూయార్క్ మధ్య ఎయిర్ బస్ ఏ350 విమాన సర్వీసు ప్రారంభించడం గమనార్హం. తన వైడ్ బాడీ విమానాల కొరతతోపాటు మెయింటెనెన్స్ , సప్లయ్ చెయిన్ వంటి సమస్యల కారణంగా అమెరికాలోని వివిధ కేంద్రాలకు 60 విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది.
న్యూఢిల్లీ-న్యూయార్క్ మార్గంలో ఎయిర్ బస్ ఏ350 సర్వీసు ప్రారంభంతో వచ్చే నెల రెండో తేదీ నుంచి వారంలో ఐదు సార్లు ఢిల్లీ-న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఏ350-900 విమాన సర్వీసు నడుపుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద ఆరు ఎయిర్ బస్ ఏ350-900 విమానాలు ఉన్నాయి.
ఆల్ట్రా లాంగౌల్ రూట్లు అంటే 16 గంటలు, అంత కంటే ఎక్కువ టైం నిరంతరాయంగా సాగే విమాన సర్వీసులు అని అర్థం. వీటిలో అత్యధికం ఉత్తర అమెరికా నగరాలకు నడుపుతుంది ఎయిర్ ఇండియా. గతేడాది డిసెంబర్ లో తొలి ఎయిర్ బస్ ఏ350-900 విమాన సర్వీసును ఎయిర్ ఇండియా ప్రారంభించింది. గత సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీ- లండన్ హీత్రూ మార్గంలో మధ్యమ శ్రేణి ఆల్ట్రా లాంగౌల్ విమాన సర్వీసు ప్రారంభించిన ఎయిర్ ఇండియా.. ఈ విమాన సర్వీసుతో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా న్యూయార్క్ నగరానికి కొత్త సర్వీసు ప్రారంభించాలని ఆసక్తితో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.