న్యూఢిల్లీ, జూన్ 16: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. దేశీయ సర్వీసుల్లో బేసిక్ ఫేర్ కేటగిరీని పరిచయం చేసింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లోని విమానాల్లోనే ఈ సదుపాయం ఉంటుందని మంగళవారం స్పష్టం చేసింది. అంతేగాక కనీస చార్జీని ఎంచుకొన్న ప్రయాణికులకు ప్రోత్సాహక ఆహారాలు అందబోవని కూడా కంపెనీ తెలియజేసింది. కానీ టీ/కాఫీలుంటాయి. ఒకవేళ బేసిక్ ఫేర్ ప్యాసింజర్లు కోరుకుంటే.. బయలుదేరడానికి 24 గంటల ముందు మీల్స్‌ను కొనుక్కునే సౌకర్యం ఉంటుంది. వెజ్, నాన్-వెజ్, డయాబెటిక్, జైన్ వంటి మీల్స్‌ను ఎంచుకోవచ్చు. ఇక బేసిక్ ఫేర్తోపాటు వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ ఫేర్ కేటగిరీలూ అందుబాటులో ఉంటాయి. వీటిపై కాంప్లిమెంటరీ మీల్స్ ఆఫర్ ఉంటుంది.
2024లో వీటిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏ రకం చార్జీలను ఎంచుకోవాలో ప్యాసింజర్ల ఇష్టమని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వివరించింది. సాధారణంగా ఫుల్ సర్వీస్ క్యారియర్లు టికెట్ చార్జీల్లో భాగంగానే ప్రోత్సాహక భోజనాలను అందిస్తాయి. అదే లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ ఇందుకు అదనంగా చార్జీలను వసూలు చేస్తాయి. మొత్తానికి బేసిక్ ఫేర్.. ఎకానమీ క్లాస్‌లలో తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకొనే ప్రయాణికులకు లాభదాయకంగా ఉండగలదన్న విశ్వాసాన్ని ఎయిర్ ఇండియా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
బేసిక్ ఫేర్ ప్యాసింజర్లకు 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్లనూ అనుమతిస్తారు. గగనతల ఆంక్షలు, పెరిగిన ఇంధన ధరల దృష్ట్యా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ బేసిక్ ఫేర్ సదుపాయాన్ని తెచ్చామని ఎయిర్ ఇండియా వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆదరణ లేని మార్గాల్లో విమాన సర్వీసులను కంపెనీ ఆపేసిన సంగతి విదితమే.