Air India | లుఫ్తాన్స గ్రూప్‌తో కోడ్‌షేర్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. భారత్‌లోని 12 నగరాలు, యూరప్‌లోని 26 నగరాల్లోని 60 అదనపు మార్గాల్లో సేవలు అందించనున్నది. ఈ విస్తరణలో భాగంగా ఇండియా ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌తో కొత్త కోడ్‌షేర్ ఒప్పందంపై సంతకాలు చేశామని.. లుఫ్తాన్స, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (SWISS)తో ప్రస్తుత కోడ్‌షేర్ ఒప్పందాలను విస్తరించిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రస్తుతం కస్టమర్లకు యూరప్‌లోని గేట్వేలు (ఫ్రాంక్ఫర్ట్, వియన్నా, జ్యూరిచ్) కాకుండా యూరప్‌లోని మొత్తం 26 గమ్యస్థానాలకు, యూఎస్‌లోని మూడు గమ్యస్థానాలకు సేవలు అందించనున్నట్లు పేర్కొంది. తొలిసారిగా ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌తో సహా లుఫ్తాన్స గ్రూప్ ఎయిర్‌లైన్స్ నిర్వహించే కొన్ని సేవలకు ‘AI’ హోదా కోడ్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్స గ్రూప్‌లోని మూడు విమానయాన సంస్థలు స్టార్ అలయన్స్‌లో ఉన్నాయి. తాజా ఒప్పందాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, లుఫ్తాన్స, స్విస్ మధ్య మొత్తం కోడ్‌షేర్ మార్గాల సంఖ్య 55 నుంచి దాదాపు వందకు పెరుగుతుందని ప్రకటనలో పేర్కొంది. అదనంగా ఎయిర్ ఇండియా, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ మధ్య కొత్త ఒప్పందం 26 కోడ్‌షేర్ మార్గాలను జోడించింది.
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాము దీర్ఘకాల సంబంధాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తున్నామని.. కొత్త భాగస్వామ్యం తమ కస్టమర్లకు మరిన్ని గమ్యస్థానాలకు యాక్సెస్‌ను, లుఫ్తాన్స గ్రూప్ ఎయిర్‌లైన్స్‌లో యూరప్ అంతటా ప్రయాణించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అదనంగా భారత్, జర్మనీ, స్విట్జర్లాండ్ మధ్య ఎయిర్ ఇండియా, లుఫ్తాన్స గ్రూప్ ప్రస్తుత విమానాలు కూడా విస్తరించిన కోడ్‌షేర్ భాగస్వామ్యంలో కవర్ అవుతాయని ఎయిర్‌లైన్ చెప్పింది. లుఫ్తాన్స గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డైటర్ వ్రాంక్స్ మాట్లాడుతూ తమ సహకారాన్ని విస్తరించడం ద్వారా యూరప్, భారతదేశం మధ్య ప్రయాణ సౌకర్యాన్ని విస్తరిస్తామన్నారు.