Air India- Wi-Fi | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. తన దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వై-ఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. తన ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9, సెలెక్ట్ ఎయిర్ బస్ ఏ321 నియో విమానాల్లో వై-ఫై కనెక్టివిటీ అందిస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా విమానాల్లో ఇన్-ఫ్లైట్ వై-ఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా టాటా సన్స్ ’ ఎయిర్ ఇండియా నిలిచింది.
గతేడాది జూలైలో అంతర్జాతీయ రూట్లలో నడిచే విమానాల్లో వై-ఫై సర్వీస్ ఆఫర్ చేసింది విస్తారా ఎయిర్ లైన్స్. అయితే, నవంబర్లో ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనమైంది. విమాన ప్రయాణికులకు మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని టెలికం శాఖ గత నవంబర్ నెలలో ప్రకటించింది. 10 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానంలో ఈ వై-ఫై సేవలు అందుబాటులోకి తేవాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో దేశీయ రూట్లలో ప్రయాణించే విమాన సర్వీసుల్లో వై-ఫై కనెక్టివిటీ తెస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి అంతర్జాతీయ రూట్లలో నడిచే ఎయిర్ బస్ ఏ350, సెలెక్ట్ ఎయిర్ బస్ ఏ321 నియో, బోయింగ్ బీ787-9 విమనాల్లో ఎయిర్ ఇండియా తెలిపింది. ఇంట్రడ్యూసరీ పీరియడ్లో భాగంగా దేశీయ సర్వీసుల్లో వై-ఫై సేవలు కాంప్లిమెంటరీగా అందిస్తారు.
‘వై-ఫై సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ పరికరాలతో ఇంటర్నెట్ తో కనెక్ట్ కావచ్చు. నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాలో చాటింగ్ చేయొచ్చు. బంధు మిత్రులకు టెక్ట్స్ మెసేజ్లు పంపొచ్చు’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.