Hyundai Motor India | పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం ఆల్టర్నేటివ్ మొబిలిటీ ఆప్షన్ల వైపు మళ్లుతున్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దీర్ఘకాలంలో 20 శాతం వాటా సంపాదించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవలే క్రెటా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించింది హ్యుండాయ్ మోటార్ ఇండియా.
ఎస్యూవీ కార్లలో అత్యంత పాపులర్ కారుగా నిలిచిన క్రెటాకార్లు ఇప్పటి వరకూ 11 లక్షలకు చేరుకున్నాయి. క్రెటా కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ క్రెటా వాటా పది శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. 11 లక్షల మందికి పైగా కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొన్నామని, ఈవీ కార్ల సెగ్మెంట్లోకి ఎంటరైన క్రెటా కారును మరే మోడల్ కారు చేరుకోలేదని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ యున్‌సూ కిమ్ చెప్పారు. సమీప భవిష్యత్‌లో మరో మూడు ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐసీఈ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో 14-15 శాతం వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌దే ప్రధానవాటా. టాటా టియాగో.ఈవీ, టాటా పంచ్.ఈవీ, టాటా నెక్సాన్.ఈవీ, టాటా కర్వ్.ఈవీ కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఎస్యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న క్రెటా ఈవీ వర్షన్ కారు సేల్స్ పది శాతం ఉంటాయని అంచనా వేస్తున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. 2025లో విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ క్రెటా ఆవిష్కరించినప్పటి నుంచి కస్టమర్ల నుంచి చాలా మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుత కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.5 శాతం మాత్రమే. 2025, 2026ల్లో పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేస్తున్నామని తరుణ్ గార్గ్ చెప్పారు.