Ministe Sridhar Babu | హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేథ’పై హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధను విసృ్తతంగా వినియోగించే దిశగా ముందుకు సాగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
రేడియాలజీ రోగనిర్దారణ పరీక్షల్లో స్పెషలిస్టు వైద్యులకు ఇప్పటికే ఏఐ తోడ్పాటునందిస్తున్నదని, పరిశోధనల ద్వారా దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐజీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‌ను ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్యరంగానికి దిక్సూచిగా మారిన నాగేశ్వరరెడ్డి తమ పరిశోధనలను ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని శ్రీధర్ బాబు కోరారు. ఏఐజిలో కృత్రిమ మేథతో పనిచేసే ‘మిరా’ అనే వర్చ్యువల్ వైద్య సహాయకురాలిని ప్రవేశ పెట్టి ఈ రంగంలో ఆయన ఆదర్శప్రాయులుగా మారారని శ్రీధర్ బాబు కొనియాడారు.