న్యూఢిల్లీ, జూన్ 18: ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ సగటు 33 శాతంగానే ఉన్నదని కాగ్నిజెంట్, పియర్సన్ నిర్వహించిన ఓ సంయుక్త సర్వేలో స్పష్టమైంది.
అమెరికా, బ్రిటన్, భారత్‌లలో కనీసం వెయ్యి మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు చెందిన 750 హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ స్టడీ జరిగింది. ఈ క్రమంలోనే మూడింటా ఒక వంతు ఎంట్రీ లెవల్ టాస్క్‌లను ఏఐనే పూర్తి చేస్తున్నట్టు హెచ్ఆర్ లీడర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెరిగే ఏఐ వినియోగం.. చాలామంది ఉద్యోగాలకే ఎసరు పెట్టవచ్చన్న ఆందోళనలు ఇప్పుడు నెలకొన్నాయి. అయితే వచ్చే ఐదేండ్లలో కొత్త ఎంట్రీ లెవల్ రోల్స్ కూడా ఏఐ వల్ల ఏర్పడవచ్చని 94 శాతం మంది హెచ్ఆర్లు చెప్తున్నారు.