AI Avatars : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో పని ప్రదేశాల్లోనూ సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల తరపున ఏఐ అవతార్స్ వర్క్ మీటంగ్స్కు హాజరవుతాయని ఓ టెక్ సీఈవో పేర్కొన్నారు. ఈ ఏఐ అవతార్స్ ఉద్యోగుల తరహాలోనే మాట్లాడటం, పనిచేయడం, సమస్యలను చక్కదిద్దడం వంటివి చేస్తాయని ఓట్టర్ సీఈవో సాం లియాంగ్ చెబుతున్నారు. తాను రోజుకు కనీసం పది సమావేశాలకు హాజరవుతానని, అందుకే ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారంతో ముందుకొచ్చానని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ దిశగా ప్రొటోటైప్ పనిచేస్తుందని వెల్లడించారు.
మనిషి తరహాలో పనిచేసేలా ఏఐ మోడల్స్‌కు డేటాను వాడుతూ శిక్షణ ఇస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఏఐ అవతార్స్కు రికార్డెడ్ మీటింగ్ నోట్స్, ఎవరినైతే ప్రతిబింబించాలో నిర్ధిష్ట వ్యక్తుల వాయిస్ డేటాపై శిక్షణ ఇవ్వాలని లియాంగ్ పేర్కొన్నారు. దీంతో అవి ఆయా వ్యక్తుల తరహాలో పనిచేస్తాయని, సంభాషణలు జరుపుతాయని వివరించారు. ఇక ఏఐ అవతార్స్‌ను లియాంగ్ కంపెనీ ప్రయోగాత్మకంగా పరీక్షించగా సమావేశంలో తమకు ఎదురైన ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలకు ఇవి దీటుగా బదులిచ్చాయని వెల్లడైంది.
మిగిలిన పది శాతం ప్రశ్నలను మానవ కార్మికుడికి నోట్‌తో పంపాయి. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు..మీరు సాయం చేయగలరా అని ఏఐ అవతార్ కార్మికుడిని ఆ నోట్లో కోరిందని లియాంగ్ వివరించారు. ఏఐ అవతార్స్ ఉద్యోగుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఉత్పాదకతను కూడా పెంచుతాయని చెప్పారు. ఈ బాట్స్‌ను కస్టమర్ సపోర్ట్, సేల్స్, టీం స్టేటస్ అప్డేట్స్ వంటి సమావేశాలకు పంపడం ద్వారా ఉద్యోగులు అదనపు గంటలను సృజనాత్మక టాస్క్‌పై వెచ్చించడం ద్వారా కంపెనీలు మెరుగైన రాబడి ఆర్జించగలవని లియాంగ్ వివరించారు. అయితే ఏఐ అవతార్స్‌లో ఉద్వేగ నియంత్రణ జోడించడం ద్వారా మరింత ఉత్పాదకత రాబట్టేలా కసరత్తు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read More :