న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉనికి కోసం పోరాడుతున్న దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియాకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరిలూదింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది మరి. సదరు కంపెనీకి గొప్ప ఊరటనిస్తూ సర్దుబాటు స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలను రూ.87,695 కోట్లకు ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. అంతేగాక చెల్లింపులపై ఐదేండ్ల మారటోరియంను కూడా ఇచ్చింది. మారటోరియంపైనా అదనపు చెల్లింపులేవీ ఉండబోవని తెలుస్తున్నది. దీంతో పునఃమదింపునకు మార్గం సుగమమైనైట్టెంది. అలాగే ఈ బాకీల చెల్లింపులను వొడా-ఐడియా 2031-32 నుంచి మొదలు పెట్టడానికి వెసులుబాటు లభించింది. అయితే 2040-41 నాటికి అన్నింటినీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీకి కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, వొడాఫోన్-ఐడియాలో కేంద్రానికి 48.9 శాతం వాటా ఉన్నది. ఈ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల కస్టమర్లున్నారు.
11% నష్టాల్లో కంపెనీ షేర్లు
వొడాఫోన్-ఐడియా షేర్లు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీగా నష్టపోయాయి. అయితే కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చినా.. మదుపరులు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. బీఎస్ఈలో షేర్ విలువ 10.85 శాతం, ఎన్ఎస్ఈలో 10.77 శాతం పతనమై రూ.10.76వద్ద ముగిసింది.