హైదరాబాద్, జూన్ 9: ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా హైదరాబాద్ రియల్టీ దూసుకుపోతున్నది. నిరుడుతో పోల్చితే గత నెల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 152 శాతం ఎగబాకాయి. మే నెలలో 6,301గా నమోదైనట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం విడుదల చేసిన తమ తాజా నివేదికలో ప్రకటించింది. అంతకుముందు నెల ఏప్రిల్‌తో పోల్చితే 17.6 శాతం పెరిగినట్టు తేలింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ద్రవ్యోల్బణ ప్రభావం వంటివి ఉన్నా ఈ స్థాయిలో వృద్ధి కనిపించడం గొప్ప విషయమని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొన్నది. ఇక మే నెలలో జరిగిన లావాదేవీల మొత్తం విలువ రూ.3,058 కోట్లుగా ఉన్నది. గత ఏడాదితో చూస్తే ఇది 146 శాతం అధికం. ఏప్రిల్‌తో పోల్చితే 9.9 శాతం అధికంగా ఉన్నది. కాగా, ఈ ఏడాది జనవరి మొదలు మే ఆఖరుదాకా హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో రిజిస్టరైన ప్రాపర్టీల మొత్తం విలువ రూ.15,071 కోట్లుగా ఉన్నది. హైదరాబాద్‌తోపాటు, మేడ్చల్-మల్క్జ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌గా పరిగణించి తాజా గణాంకాలను విడుదల చేశారు.
ఇండ్ల ధరల ఆధారంగా చూస్తే రూ.25 లక్షలు-50 లక్షల శ్రేణిలో ఎక్కువగా ఆదరణ కనిపిస్తున్నది. మే నెలలో ఈ ధరల్లోని నివాసాల అమ్మకాలే 55 శాతంగా ఉన్నాయి. రూ.25 లక్షలలోపు ఇండ్లకు డిమాండ్ 18 శాతానికి పడిపోయినట్టు ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. అలాగే రూ.50 లక్షలు, ఆపై ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు 27 శాతానికి పెరిగాయి. నిరుడు మే నెలలో 26 శాతంగా ఉన్నాయి.
గత కొన్నేండ్లుగా హైదరాబాద్ రియల్టీలో బలమైన డిమాండ్ కనిపిస్తున్నది. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం ప్రభావాలతో సంబంధం లేకుండా వృద్ధిని నమోదు చేస్తున్నది. అయితే పెరుగుతున్న నిర్మాణ వ్యయం కొన్ని ధరల పరిధిలోని వర్గాలను ప్రభావితం చేస్తున్నది. అయినప్పటికీ ఓవరాల్‌గా నగర మార్కెట్ ఆకర్షణీయం. ఉద్యోగ భద్రత, పెరుగుతున్న వినియోగదారుల ఆదాయ వనరులు-పొదుపు, ఇతరత్రా సౌకర్యాలు కొనుగోళ్లకు కలిసొస్తున్నాయి.
-శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ