Zeet Adani Marriage | భారతీయ కుబేరుడు గౌతం అదానీ చిన్న కొడుకు జీత్ ఓ ఇంటివాడు కానున్నాడు. ఆయన వివాహం వచ్చేనెలలో నిరాడంబరంగా, సంప్రదాయంగా జరుగనున్నది. రాజకీయ, సినీ, కార్పొరేట్ ప్రముఖుల హడావుడి లేకుండా జరుగనున్నది. ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వచ్చిన గౌతం అదానీ ఈ సంగతి చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీన తన కొడుకు జీత్ పెండ్లి జరుగుతుందన్నారు. సూరత్ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు దివాషాతో జీత్ వివాహం చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా జరుగుతుందన్నారు.
ఇటీవల మరో భారత్ బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెండ్లికి దేశ దేశాల ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. 2023 మార్చిలో జీత్ అదానీ, దివా షా నిశ్చితార్ధం అహ్మదాబాద్‌లో జరిగింది. జీత్ – దివా షా వివాహానికి అతిథులు 58 దేశాల నుంచి వస్తారని, వారు వెయ్యి సూపర్ కార్లు, వందలాది ప్రైవేట్ జెట్ విమానాల్లో వివాహ వేదిక అహ్మదాబాద్‌కు వస్తారని భావిస్తున్నారు. తాము మహా కుంభ్ మేళా సెలబ్రిటీలం కాబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా గౌతం అదానీ చెప్పారు. గౌతం అదానీతోపాటు జీత్ అదానీ, గౌతం అదానీ పెద్ద కొడుకు కరణ్ అదానీ- పారిధి, మనుమరాలు కావేరి తదితరులు ఉన్నారు.