Adani Wilmar | అదానీ విల్మార్ నుంచి అదానీ గ్రూప్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో మంగళవారం అదానీ విల్మార్ షేర్లు దాదాపు ఎనిమిది శాతం పతనమైంది. ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మార్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 200 కోట్ల డాలర్లకు పైగా విలువ గల 31.06 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని అదానీ ఎంటర్ ప్రైజెస్ పేర్కొంది. దీంతో మంగళవారం బీఎస్ఈలో అదానీ విల్మార్ షేర్ 7.95 శాతం నష్టంతో రూ.303.30, ఎన్ఎస్ఈలో 7.80 శాతం నష్టంతో రూ.303.10 లకు పతనమైంది.
అదానీ విల్మార్ నుంచి ఓపెన్ మార్కెట్లో 31.06 శాతం వాటాను విక్రయించడంతోపాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 13 శాతం వాటాను అదానీ ఎంటర్ ప్రైజెస్ విక్రయిస్తుంది. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు సుమారు రూ.17,100 కోట్ల నిధులు సమకూరుతాయి. అదానీ విల్మార్ నుంచి పూర్తి వాటా విక్రయించడంతోపాటు అందులో అదానీ గ్రూప్ నామినీ డైరెక్టర్లు గౌతం అదానీ మేనల్లుడు ప్రణవ్ వీ అదానీతోపాటు మలయ్ మహదేవియా కూడా వైదొలుగుతారు. 2025 మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానున్నది.
2024 సెప్టెంబర్ 30 నాటికి అదానీ విల్మార్ సంస్థలో అదానీ ఎంటర్ ప్రైజెస్, విల్మార్ గ్రూప్ సంస్థలు 43.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. అంతకు ముందు 2022 ఫిబ్రవరిలో ఐపీఓ ద్వారా అదానీ విల్మార్ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ ద్వారా రూ.3,600 కోట్ల నిధులు సేకరించింది. 1999 జనవరిలో అదానీ విల్మార్ అనే జాయింట్ వెంచర్ సంస్థను అదానీ ఎంటర్ ప్రైజెస్, విల్మార్ గ్రూప్ ఏర్పాటు చేశాయి.