Adani Wilmar | భారత బిలియనీర్ గౌతం అదానీ (Gautam Adani )సారధ్యంలోని అదానీ గ్రూప్ (Adani Group) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మార్ (Adani Wilmar) నుంచి తన వాటా పూర్తిగా విక్రయిస్తున్నట్లు అదానీ గ్రూప్ (Adani Group) ఫ్లాగ్ షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) సోమవారం ప్రకటించింది. అదానీ గ్రూప్ అవినీతికి పాల్పడిందని అమెరికా కోర్టులో అభియోగాలు నమోదైన తర్వాత సింగపూర్ సంస్థ విల్మార్తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ నుంచి నిష్క్రమించడం గమనార్హం. తద్వారా 200 కోట్ల డాలర్ల నిధులను అదానీ గ్రూప్ సేకరించనున్నది.
వంటనూనెల బ్రాండ్ ఫార్చ్యూన్ (Fortune), గోధుమ పిండి, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ అదానీ విల్మార్ (Adani Wilmar)లో అదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) సంస్థకు 43.94 శాతం వాటా ఉంది. ఇందులో 31.06 శాతం వాటాను నేరుగా, మిగతా 13 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. విల్మార్కు అదానీ ఎంటర్ ప్రైజెస్ తన 31.06 శాతం వాటాలను విక్రయించడం వల్ల రూ.12,314 కోట్ల నిధులు లభిస్తాయి. దీంతోపాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించడం ద్వారా 200 కోట్ల డాలర్ల పై చిలుకు (సుమారు రూ.17,100 కోట్లు) నిధులను అదానీ గ్రూప్ సేకరించనున్నది.
2025 మార్చి 31 లోపు ఈ వాటాల విక్రయం పూర్తి కావాలని భావిస్తోంది. ఆ లోగా అదానీ విల్మార్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డు నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ నామినీలు కూడా తప్పుకుంటారు. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన మూడేండ్లలో కనీసం 25 శాతం షేర్లు పబ్లిక్కు అందుబాటులో ఉండాలని సెబీ నిబంధన. 1999లో ఏర్పాటైన అదానీ విల్మార్ (Adani Wilmar).. ఫార్చూన్ బ్రాండ్ వంట నూనె, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, బియ్యం, పంచదార తదితర వస్తువులు విక్రయిస్తోంది. 10 రాష్ట్రాల పరిధిలో 23 ప్లాంట్లు కలిగి ఉంది.