Deloitte-Adani Group | అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెల్లాయిట్ రాజీనామా చేయడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనం అయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ సంస్థ అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్స్ 5.4 శాతం పతనమై రూ.2401.10 వరకు పడిపోయి తిరిగి రూ.2422.25 (4.58 శాతం నష్టం) వద్ద నిలిచింది. ఇక అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్ దాదాపు నాలుగు శాతం నష్టంతో ఇంట్రా డే కనిష్ట స్థాయి రూ.771కి పడిపోయి.. తిరిగి రూ.778.90 (2.72 శాతం నష్టం) వద్ద ట్రేడ్ అవుతున్నది.
డెల్లాయిట్ రాజీనామా చేయడంతో తాము కత్తగా ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్ సంస్థను అడిటర్‌గా నియమించుకున్నట్లు శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వెల్లడించింది. ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్.. ప్రపంచంలోని ఆరు టాప్ అడిటింగ్ సంస్థల్లో ఒకటి.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా వైదొలిగిన డెల్లాయిట్.. అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థకు సంబంధించి హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. దీనికి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అంగీకరించలేదని తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే, అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేస్తున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నివేదిక సమర్పించడానికి మరో 15 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.