Adani-Hindenburg | అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లలో నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి ప్రతిపాదిత నిపుణుల కమిటీకి సీల్డ్ కవర్లో తమ సూచనలు సమర్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే విషయంలో పారదర్శకత పాటించాలని తాము భావిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ప్రతిపాదిత నిపుణుల కమిటీకి పేర్లను సీల్డ్ కవర్లో సమర్పిస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని ఆమోదించబోమని పేర్కొన్నది. తామే నిపుణుల కమిటీని ప్రకటించి, విచారణకు ఆదేశిస్తామని తేల్చి చెప్పింది.
`స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని మేం కోరుకుంటున్నాం. కనుక సీల్డ్ కవర్లో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సమర్పిస్తామన్న మీ (కేంద్రం) సూచనలను మేం ఆమోదించం` అని ధర్మాసనం తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఆ గ్రూపు షేర్లు పతనం కావడం వల్ల స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఈ నెల 10న సుప్రీంకోర్టు వెల్లడించింది. స్టాక్ మార్కెట్ల నియంతణ నిబంధనలు బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారధ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్దమేనా? అని కేంద్రాన్ని న్యాయస్థానం అడిగింది.
అదానీ గ్రూపుల ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్లలో అవకతవకలపై నివేదిక సమర్పించిన హిండెన్బర్గెన్ రీసెర్చ్‌కి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను కాపాడాలని న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సామాజిక కార్యకర్త ముకేశ్ కుమార్ దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్ల డాలర్లకు పైగా ఆవిరై పోయింది.