న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది. టాప్-20 ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితా నుంచి అదానీ వైదొలిగారు. మంగళవారం సైతం పలు అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో 23వ స్థానంలోకి గౌతమ్ అదానీ జారిపోయారు. తాజా ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన సంపద 53.2 బిలియన్ డాలర్లు (రూ.4.40 లక్షల కోట్లు). గత ఏడాది ఒక దశలో 160 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా ఎలాన్ మస్క్ తర్వాత ద్వితీయస్థానంలో ఉన్న అదానీ జనవరి మూడో వారంలో 130 బిలియన్ డాలర్ల సంపదతో మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. జనవరి 24న అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలతో కూడిన నివేదిక విడుదల చేయడంతో అదానీ సంపద వేగంగా హరించుకుపోయింది. వారం రోజుల క్రితం టాప్-20 చివరిస్థానంలో ఉన్న అదానీ ఈ వారం దానిని సైతం కోల్పోయారు. కేవలం మూడు వారాల్లోనే అదానీ సంపదలో సగానికి పైగా నష్టపోయారు.
9వ స్థానంలో అంబానీ
భారత్‌కు చెందిన మరో పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రస్తుతం 83.8 బిలియన్ డాలర్ల (రూ.6.94 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. అలాగే ఆసియాలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ముకేశ్ అంబానీయే. ఫోర్బ్స్ జాబితాలో ప్రధమస్థానంలో 214 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్, రియల్టీ వ్యాపార సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. రెండవ స్థానంలో ఉన్న టెస్లా ఎలాన్ మస్క్ సంపద 192 బిలియన్ డాలర్లు. మూడో స్థానంలో 123 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు.