Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): సరిగ్గా 27 రోజుల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతవ్‌ు అదానీ స్థానం ప్రస్తుతం 26కు పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో.. జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 57 శాతం అంటే 136 బిలియన్ డాలర్లు (రూ. 11,25,824 కోట్లు) క్షీణించింది. ఇది మన దేశ జీడీపీలో 4.2 శాతానికి సమానం. అంగోలా దేశ వార్షిక జీడీపీ కూడా దాదాపుగా ఇంతే. మంగళవారం అదానీ గ్రూప్ పరిధిలోని 10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల దిగువకు వచ్చేసింది. అంటే, ఇప్పటివరకూ 100 బిలియన్ డాలర్ క్లబ్లో కొనసాగిన అదానీ గ్రూప్ ఇకపై ఆ క్లబ్లో లేనట్లే. ఈ మేరకు ‘బ్లూమ్‌బర్గ్’ పత్రిక ఓ నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం 57-60% నష్టం వద్ద అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వరుస అమ్మకాలతో అదానీ గ్రూప్‌నకు చెందిన 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.19.2 లక్షల కోట్ల నుంచి రూ.8.2 లక్షల కోట్లకు తగ్గిపోయింది. లిస్టెడ్ అదానీ కంపెనీల మొత్తం స్టాక్ విలువ దేశంలోనే టాప్ కంపెనీలుగా పేరున్న ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈక్విటీ మార్కెట్ క్యాప్ కంటే ప్రస్తుతం తక్కువగా ఉన్నది.
ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలపై ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత పన్నును విధించే ప్రతిపాదనను భారత్ అడ్డుకొన్నది. ఈ పన్ను ప్రతిపాదనను అమెరికా, సౌదీ అరేబియా, ఇండియా మాత్రమే వ్యతిరేకించాయని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిరో తెలిపారు. ప్రపంచ పన్ను సంస్కరణలపై ఈ నెల 24, 25లో భారత్‌లో నిర్వహించనున్న జీ 20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు మెయిరో ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకొన్నది.