Adani on NDTV | ఎన్డీటీవీ ప్రమోటర్స్ కంపెనీ వాటా కొనుగోలు చేయడానికి సెబీ ఆమోదం అవసరం అన్న ఆ సంస్థ యాజమాన్య ప్రకటనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయరాదని ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్, రాధికారాయ్లను నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఆదేశాలు వారికి మాత్రమే వర్తిస్తాయని.. సెబీ ఆదేశాల పరిధిలోకి తమ బిడ్ రాదని పేర్కొన్నది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లేవనెత్తిన వివాదాలు చట్టబద్ధంగా నిలబడవని అదానీ గ్రూప్ అనుబంధ.. అదానీ ఎంటర్ప్రైజెస్ శుక్రవారం తేల్చి చెప్పింది. వీసీపీఎల్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం తమకు 29.18 శాతం వాటాలను కేటాయించాలని ఎన్డీటీవీని కోరింది.
ఎన్డీటీవీ ప్రమోటర్లు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుపకుండా 2020 నవంబర్‌లో రెండేండ్ల నిషేధం విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఈ ఏడాది నవంబర్ 26తో ముగిస్తుంది. అయితే, ఆర్ఆర్పీఆర్ యాజమాన్యం తమ ఒప్పంద బాధ్యతను పూర్తి చేయడం.. సెబీ ఆదేశాల ఉల్లంఘన కిందకు రాదని అదానీ గ్రూప్ వాదిస్తున్నది. ప్రణయ్ రాయ్, రాధికారాయ్ షేర్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కేటాయించరాదని మాత్రమే సెబీ ఆదేశించిందని పేర్కొంది.
2009లో వీసీపీఎల్ కంపెనీ వద్ద ప్రణయ్‌రాయ్, రాధికారాయ్ ప్రమోటర్లుగా ఉన్న ఆర్ఆర్పీఆర్ రూ.400 కోట్ల రుణం తీసుకున్నది. ఈ రుణం విలువ 29.18 శాతం ఉంటుంది. రుణానికి ప్రతిగా వీసీపీఎల్‌కు ఈ వాటాలను ఆర్ఆర్పీఆర్ కేటాయించింది. వీసీపీఎల్-ఆర్ఆర్పీఆర్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సకాలంలో రుణాలు చెల్లించని పక్షంలో ఆర్ఆర్పీఆర్లో 29.18 శాతం వాటా హక్కులను దఖలు పర్చమని వీసీపీఎల్ కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీసీపీఎల్‌ను టేకోవర్ చేసిన అదానీ గ్రూప్.. ఎన్డీటీవీలో వాటాలు క్లయిమ్ చేస్తున్నది.
అంతే కాదు. రూ.493 కోట్ల విలువైన 26 శాతం వాటాలకు షేర్ విలువ రూ.294 ప్రాతిపదికన ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తామని అదానీ గ్రూప్ చెబుతున్నది. అదే జరిగితే ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 55 శాతానికి పెరుగుతుంది.
ఇప్పటివరకు ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారులుగా దాని ప్రమోటర్ ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికారాయ్ ఉన్నారు. వారిద్దరికి కలిసి ఎన్డీటీవీలో కేవలం 32 శాతం వాటాలు ఉన్నాయి.