న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలో రేవుల నుంచి విమానాశ్రయాల వరకూ వరుసపెట్టి కొనుగోళ్లు జరుపుతున్న అదానీ గ్రూప్.. దేశంలో ప్రాచుర్యం పొందిన మీడియా హౌస్ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను హఠాత్తుగా చేజిక్కించుకుంది. ఎన్డీటీవీ ప్రమోటర్ల అనుమతి, వారితో సంప్రదింపులు లేకుండానే వారికి చెప్పాపెట్టకుండా టేకోవర్ చేసేసింది. మంగళవారం శరవేగంగా జరిగిన పరిణామాలిలా ఉన్నాయి. తాము ఎన్డీటీవీలో వారెంట్ల మార్పిడి ద్వారా 29 శాతం వాటా పొందామని, మరో 26 శాతం వాటాను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ జారీచేస్తున్నట్టు తొలుత అదానీ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
ఎన్డీటీవీ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ (ఆర్ఆర్పీఆర్హెచ్)లో తమ గ్రూప్ సంస్థలు వారెంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా 29.16 శాతం వాటా వచ్చిందంటూ తెలిపింది. తమ వ్యవస్థాపకుల నుంచి అనుమతి పొందకుండానే ఆర్ఆర్పీఆర్లో వాటాను స్వాధీనం చేసుకున్నట్టు…అదానీ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఎన్డీటీవీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. వారెంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్న విషయం తమ ఫౌండర్లకు కేవలం ‘ఈ రోజే (మంగళవారం) తెలిసిందని’ ఎన్డీటీవీ తెలిపింది.
పదేండ్ల క్రితం 2009-10లో ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు అదానీ గ్రూప్ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్)తో ఒక రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఆ మేరకు 19,90,000 వారెంట్లను ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ఈక్విటీ షేర్లుగా మార్చుకుంటూ, రూ.1.99 కోట్లను ఆర్ఆర్పీఆర్హెచ్కు బదిలీ చేసినట్టు వీసీపీఎల్ తమ వ్యవస్థాపకులకు ఒక నోటీసు జారీచేసిందని ఎన్డీటీవీ తెలిపింది. 2009లో వీసీపీఎల్ నుంచి ఎన్డీటీవీ ప్రమోటర్లు రూ. 250 కోట్లు రుణం తీసుకొని వారెంట్లు జారీ చేశారు. ఆర్ఆర్పీఆర్హెచ్కు ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా ఉంది. రెండు రోజుల్లో వీసీపీఎల్‌కు ఈక్విటీ షేర్లన్నింటినీ బదిలీ చేయాలంటూ ఆర్ఆర్పీఆర్హెచ్కు హుకుం జారీ అయ్యిందని ఎన్డీటీవీ వాపోయింది. తమ ప్రమోటర్లు కంపెనీలో వాటా విక్రయానికి ఎటువంటి చర్చలూ జరపడం లేదంటూ సోమవారం వరకూ ఎన్డీటీవీ చెపుతూ వస్తున్నది. ‘ఎన్డీటీవీలో వాటా అమ్మడానికి లేదా, యాజమాన్యం మార్పునకు రాధికా, ప్రణయ్ రాయ్‌లు సంప్రదింపులేవీ చేయడం లేదని’ మీడియా హౌస్ తెలిపింది. ఎన్డీటీవీ పెయిడ్అప్ మూలధనంలో 61.45 శాతం వాటాను ప్రమోటర్లు వ్యక్తిగతంగానూ, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ద్వారానూ కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్‌లో మార్పులేవైనా ఉంటే తొలుత స్టాక్ ఎక్సేంజీలకు, రెగ్యులేటర్లకు తెలియచేయాల్సిన బాధ్యత తమ ప్రమోటర్లపై ఉందని ఎన్డీటీవీ తెలిపింది.
‘ఎన్డీటీవీ, రాధికా, ప్రణయ్రాయ్లు ఈ రోజు జరిగిన పరిణామాలను ఎంతమాత్రం ఊహించలేదని’ ఎన్డీటీవీ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత కమ్యూనికేషన్లో తెలిపింది. రెగ్యులేటరీ, లీగల్ ప్రక్రియలకు సంబంధించిన తదుపరి చర్యల్ని చేపట్టేపనిలో తాము ఉన్నామని ఎన్డీటీవీ వెల్లడించింది.
న్యూస్ చానల్ ఎన్డీటీవీలో ఇప్పటికే 29 శాతం వాటాను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493 కోట్ల విలువైన ఓపెన్ ఆఫర్‌ను జారీచేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో అదానీ వాటా 55 శాతానికి చేరుతుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో తమ గ్రూప్ సంస్థలు వారెంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా 29.16 శాతం వాటా వచ్చిందని అదానీ గ్రూప్ మంగళవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దీంతో షేరుకు రూ.294 ధరతో ఇన్వెస్టర్ల నుంచి 1,67,62,530 ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ జారీచేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది 300 శాతం పెరిగిన ఎన్డీటీవీ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో రూ.366 వద్ద ముగిసింది. ఈ ధరకంటే అదానీ ఓపెన్ ఆఫర్ ధర 19.71 శాతం తక్కువ. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, రాధికారాయ్లిద్దరికీ కంపెనీలో 32.26 శాతం వాటా ఉంది.