(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బొగ్గు గనులు, రేవులు, విద్యుత్తు, ఎయిర్‌పోర్ట్‌లు, డాటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ, సిమెంట్, టెలికం, మీడియా తదితర రంగాలకు విస్తరిస్తున్న అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ గతంలోనే హెచ్చరించింది. ఎడాపెడా తీసుకున్న రుణాల్నే ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడి చేస్తున్నదంటూ పేర్కొంది.
అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన వృద్ధి ప్రణాళికలు.. పరిస్థితులు ప్రతికూలిస్తే రుణ ఊబిలోకి దించుతాయని, దీంతో గ్రూప్ మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉందంటూ తీవ్ర హెచ్చరికను జారీచేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన పది లిస్టెడ్ కంపెనీల స్థూల రుణం 2022 మార్చినాటికి రూ. 2.31 లక్షల కోట్ల మేర ఉన్నదని ఫిచ్ వెల్లడించింది. ఒకవేళ గ్రూప్ దివాళా అంచునకు చేరితే.. రూ. 21 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చు. ఇది పరోక్షంగా కోట్లాది భారతీయులపై ప్రభావం చూపనున్నది. కారణం.. విద్యుత్తు, విమానాశ్రయాలు, గ్యాస్, సిమెంట్ తదితర సెక్టార్లలో అదానీ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తుండటమే.
అనుమానాలు పాతవే!
ఎనిమిదేండ్ల క్రితం రూ. 17 వేల కోట్ల నికర ఆస్తులను కలిగిన అదానీ.. హిండెన్‌బర్గ్ నివేదిక రావడానికి ముం దు రూ. 9.8 లక్షల కోట్లకు పడగెత్తడం వెనుక ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో పాటు ఆర్థిక అవకతవకలు పాల్పడినట్టు గతంలోనూ ఆరోపణలొచ్చాయి. హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ లాంటి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకుల ద్వా రా గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (ఫిన్సెస్) ఆరోపించింది. ట్యాక్స్ హెవెన్ దేశాల్లో ఒకటిగా పేర్కొన్న సీషెల్స్ నుంచి సింగపూర్‌లోని ‘అదానీ గ్లోబల్ పీటీఈ’కి మనీల్యాండరింగ్ ద్వారా బిలియన్ డాలర్ల నిధులు బదిలీ అయినట్టు అప్పట్లో వెల్లడించింది.