(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కో సం ప్రధాని మోదీ ఉవ్విళ్లూరుతారని విపక్షాలు మండిపడుతూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల ఆరోపణలను నిజం చేస్తూ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పలు నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటికే వివాదాస్పదమయ్యింది. తాజాగా రాష్ర్టాల్లోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లు కూడా అదానీకి ప్రయోజనం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుండటం, దాని కోసం ఏకంగా టెండర్ల నిబంధనల్లోనే మార్పుచేర్పులు చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఓ సంచలనాత్మక కథనంలో వెల్లడించింది.
బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్ విద్యుత్తు అవసరాల కోసం ఇటీవల టెండర్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 25 సంవత్సరాలకు గానూ రాష్ట్ర విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, సోలార్ విద్యుత్తుతో పాటు థర్మల్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసే కంపెనీలే ఈ బిడ్డింగ్‌లో పాల్గొనాలంటూ రెండు ప్రభుత్వాలు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టిన కొత్త కంపెనీలు, ఏండ్ల నుంచి థర్మల్ రంగానికే పరిమితమైన పాత కంపెనీలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి వీలు లేకుండా పోయింది. అటు సోలార్, ఇటు థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసే అదానీ గ్రూప్ వంటి అతి తక్కువ కంపెనీలే ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హతను సంపాదించాయి. బిడ్డింగ్ ప్రక్రియలో చివరకు అదానీ కంపెనీ మాత్రమే మిగిలింది. దీంతో మహారాష్ట్రకు 6,600 మెగావాట్లు (5,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు, 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు) సంబంధించిన కాంట్రాక్ట్‌ను అదానీ కంపెనీ గెలుచుకొన్నది. ఇక రాజస్థాన్‌కు అవసరమైన 11,200 మెగావాట్ల (8,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు, 3,200 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు) ప్రాజెక్టులో అదానీ గ్రూప్ కంపెనీ ముందంజలో నిలిచింది.
అదానీ గ్రూప్ కంపెనీకి లబ్ధి చేకూర్చడానికే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను మార్చాయని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. 2014 బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తించాయని ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాలో గుత్తాధిపత్యం కారణంగా కరెంటు ఛార్జీలు పెరిగే ప్రమాదమున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతిమంగా వినియోగదారులపై అదనపు భారంగా మారుతుందని విరుచుకుపడుతున్నారు.