Ambani-Adani | రుణ ఊబిలో చిక్కుకున్న ‘ఫ్యూచర్ రిటైల్’ను టేకోవర్ చేసుకునేందుకు ఆసియా కుబేరుడు గౌతం అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పోటీ పడుతున్నారు. అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ అండ్ ఫ్లమింగో గ్రూప్ జాయింట్ వెంచర్ మూన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ సహా 13 ఇతర సంస్థలు ఫ్యూచర్ రిటైల్‌ను టేకోవర్ చేయడానికి బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. శాలీమార్ కార్పొరేషన్ లిమిటెడ్, నాల్వా స్టీల్ అండ్ పవర్, యునైటెడ్ బయోటెక్, విస్మిత్ ట్రావెల్, కాప్రీగ్లోబల్ హోల్డింగ్స్ తదితర సంస్థలు కూడా బరిలో నిలిచాయని తెలిసింది.
బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించడంలో ఫ్యూచర్స్ రిటైల్ వెనుక బడింది. ఇంతకుముందు రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్‌కు ఫ్యూచర్ తన ఆస్థులను విక్రయించడానికి ప్రయత్నించింది. 3.4 బిలియన్ల డాలర్లకు రిలయన్స్‌కు విక్రయించాలని ఫ్యూచర్ రిటైల్ భావించింది. కానీ, అమెజాన్ న్యాయ పోరాటానికి దిగడంతో రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ ఒప్పందం అమలు కాలేదు. దీనికి తోడు సంస్థ రుణ ఊబిలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌పై దివాళా ప్రక్రియ మొదలైంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సారధ్యంలోని 33 బ్యాంకులు రూ.21 వేల కోట్లకు పైగా రుణాలు ఉన్నాయని గత ఆగస్టులో ప్రకటించాయి. దీంతోపాటు ఫ్యూచర్ రిటైల్‌పై బ్యాంకులు దివాళా ప్రక్రియ ప్రారంభించాయి. దేశంలోనే రెండో అతిపెద్ద రిటైల్ గ్రూప్.. ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ రిటైల్ ఆర్మ్ ఫ్యూచర్ రిటైల్ టేకోవర్ కోసం బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల ప్రారంభంలో ముగిసింది.
2024 నాటికల్లా రిటైల్ మార్కెట్ రూ.100 లక్షల కోట్ల మార్కెట్‌కు చేరుతుందని, భారత్ రిటైల్ మార్కెట్ 900 బిలియన్ల డాలర్ల (రూ.69 లక్షల కోట్లు)కు చేరుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద కంపెనీలు.. ఫ్యూచర్ రిటైల్‌ను టేకోవర్ చేయడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో రిలయన్స్ రిటైల్ పోటీ పడుతున్నది. ఈ నేపథ్యంలో మున్ముందు రిటైల్ మార్కెట్లో ప్రత్యేకించి ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో పట్టు కోసం బడా కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి.