Adani | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: అదానీ కన్ను పడిందంటే చాలు అది భస్మం కావాల్సిందే.. అన్నట్టు సాగుతున్నది ఆయన తీరు. దేశీయ వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా ఎదుగుతున్న గౌతమ్ అదానీ.. సిమెంట్ రంగంలో గుత్తాధిపత్యం సాధించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీలను హస్తగతం చేసుకున్న అదానీ తాజాగా తన కన్ను ఓరియంట్ సిమెంట్‌పై పడింది. దక్షిణాదితోపాటు ఉత్తరాది మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వేగంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంట్లో భాగంగానే సీకే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్ సిమెంట్‌ను రూ.8,100 కోట్లతో కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు.
దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న అంబుజా సిమెంట్.. సీకే బిర్లాతోపాటు నిర్దిష్ఠ వాటాదారులకు చెందిన 46.8 శాతం వాటాను రూ.3,791 కోట్లతో కొనుగోలు చేయబోతున్నది. దీంతోపాటు మరో 26 శాతం వాటాను ఒపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొనుగోలుకు అయ్యే నిధులను అంతర్గత వనరుల ద్వారా సేకరిస్తున్నది. ఈ ఏడాది అంబుజా కొనుగోలు చేసిన రెండో ఒప్పందం ఇది కావడం విశేషం. ఓరియంట్కు దేశవ్యాప్తంగా ఉన్న రెండు ప్లాంట్ల కెపాసిటీ 85 లక్షల టన్నులు. దీంతో అంబుజా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 97.4 మిలియన్ టన్నులకు చేరుకోనున్నది. 2028 నాటికి దేశవ్యాప్తంగా 140 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అదానీ గ్రూపు చిన్న స్థాయి సంస్థలను కొనుగోలు చేస్తున్నది. తన పోటీ సంస్థయైన అల్ట్రాటెక్ సిమెంట్ కెపాసిటీ 149.5 మిలియన్ టన్నులు.
చిన్న సంస్థలే లక్ష్యం
సిమెంట్ రంగంలో గుత్తాధిపత్యం సాధించడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ. ఇప్పటికే పలు చిన్న స్థాయి సంస్థలను తన ఖాతాలో వేసుకున్న ఆయన..ప్రస్తుతం తన కన్ను మధ్యస్థాయి సంస్థలపై పడింది. మూడు నెలల క్రితం హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసిన ఆయన తాజాగా అతిపెద్ద సంస్థయైన అల్ట్రాటెక్‌ను ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు.
ఓరియంట్ వివరాలు
అదానీ గ్రూపు కొనుగోలు చేసిన సంస్థలు..
సిమెంట్ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోళ్లు జరిపాం. దీంతో వచ్చే రెండేండ్లకాలంలో అంబుజా ప్లాంట్ల కెపాసిటీ మరో 30 మిలియన్ టన్నులు పెరగనున్నది. సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది దోహదం చేయనున్నది.
– కిరణ్ అదానీ, అంబుజా సిమెంట్ డైరెక్టర్