హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రష్యాకు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్, డాటా రికవరీలో దిగ్గజ సంస్థయైన ఏసీఈ ల్యాబ్..జూమ్ టెక్నాలజీస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్, తయారీ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి మంగళవారం సచివాలయంలో ఏసీఈ ల్యాబ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీవోవోతోపాటు ఆయా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాము ఏర్పాటుచేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రికి వివరించారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 129 దేశాలకు చెందిన ఆయా దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం తమకు ఉందని, డాటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఫోరెన్సిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఏసీఈ సంస్థను మంత్రి అభినందించారు. మరోవైపు, మంత్రి శ్రీధర్ బాబుతో టిబిటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.