రాజేశ్ వయసు 25. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. వ్యక్తిగత రుణం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే నిరాశే ఎదురైంది. ఆ డాక్యుమెంట్లు కావాలి.. ఈ ష్యూరిటీలు తేవాలంటూ బ్యాంక్ సిబ్బంది రకరకాల రూల్స్‌ను ముందటపెట్టారు మరి.
సతీశ్ వయసు 30. సొంతంగా ఓ షాపును నిర్వహిస్తున్నాడు. ఇంటి రుణం కోసం బ్యాంకులకు వెళ్తే మోత మోగించే వడ్డీరేట్లు చెప్పారు. ప్రాపర్టీకి సంబంధించి కూడా ప్రాంతం, విస్తీర్ణం, ప్లానింగ్, లే-అవుట్, అనుమతులంటూ పెద్ద చిట్టానే చదివారు. దీంతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఇదీ.. ఇప్పుడు లోన్ కావాలంటూ బ్యాంకులకు చేరినవారికి ఎదురవుతున్న పరిస్థితి.. కాదు దుస్థితి. అవును.. ఆయా రుణాలపై బ్యాంకర్లు నిబంధనల్ని కఠినతరం చేశారు. దీంతో సామాన్యులకు పైసా కూడా అప్పు పుట్టకుండా పోతున్నది.
ముంబై, సెప్టెంబర్ 20: కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేసిమరీ వందలు, వేల కోట్ల రూపాయల్ని అప్పుగా ఇస్తున్న బ్యాంకర్లు.. సామాన్యులకు మాత్రం లక్ష కొర్రీలు పెడుతూ మొండిచెయ్యి చూపిస్తున్నారు. పెరుగుతున్న రిటైల్ రుణాలు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన బ్యాంకింగ్ సంస్థలు.. నిబంధనల్ని కఠినతరం చేసేశాయి. ఈ ప్రభావం పెద్దలపై ఎలా ఉన్నా.. మధ్యతరగతివారిపై మాత్రం పెద్దగానే పడుతున్నది. లక్ష రూపాయల పర్సనల్ కోసం వెళ్లినా.. 10 లక్షల గృహ రుణం కోసం అడిగినా.. రూల్స్ మీద రూల్స్ చెబుతూ సగటు మనిషి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా షూరిటీల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తున్నదని చాలామంది వాపోతున్నారు.
ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ..
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లోనూ రుణగ్రహీతలకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ఇక ఉద్యోగేతరులపై వడ్డీభారం భారీగా పడుతున్నది. కొన్నైతే 14 శాతం నుంచి 22 శాతం మేర వసూలు చేస్తుండటం గమనార్హం. సిబిల్ స్కోర్, స్థిరాస్తి లావాదేవీల్లో సమస్యలనుబట్టి ఈ వడ్డీరేట్లుంటున్నాయి. నిజానికి మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)లు కార్పొరేట్ రుణాల్లోనే ఎక్కువ. రుణాల్ని ఎగవేసేదీ బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలేనని ఎన్పీఏ గణాంకాలూ చెప్తున్నాయి. అయినప్పటికీ కఠినం చేసిన నిబంధనలు సామాన్య రుణగ్రహీతల్నే ఎక్కువగా ఇబ్బందిపెడుతున్నాయి.
మార్కెట్‌పై ప్రభావం
బ్యాంకింగ్ రుణాల లభ్యత లేక ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్లలో నీరసం కనిపిస్తున్నది. వాహన, నిర్మాణ రంగాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో ఆటో సంస్థలు ఆయా ఫైనాన్స్ కంపెనీలతో ప్రత్యేకంగా తమ వాహన అమ్మకాల కోసం జట్టు కడుతున్నాయి. బడా రియల్టర్లూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు లోన్ మేళాల్ని నిర్వహిస్తున్నారు. అసలే ఆర్థిక మందగమనం ఛాయలు కనిపిస్తున్న తరుణంలో కఠిన బ్యాంకింగ్ నిబంధనలు మార్కెట్‌కు శరాఘాతంలా పరిణమిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతల్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం బాగానే ఉన్నా.. అతితో అనర్థాలేనని ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు.
ఆదాయంపై అబద్ధాలు..
రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆదాయాన్ని ఎక్కువగా పేర్కొనడం సాధారణంగా జరిగేదేనని ప్రతీ ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు (63 శాతం) అభిప్రాయపడ్డట్టు ఓ తాజా సర్వే తెలిపింది. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 39 శాతంగానే ఉన్నది. గ్లోబల్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఫికో.. దేశీయంగా నిర్వహించిన ఈ సర్వేలో ఉద్దేశపూర్వకంగానే గృహ, వ్యక్తిగత రుణాల కోసం తమ ఆదాయంపై అబద్ధాలు ఆడుతున్నట్టు 27 శాతం మంది స్పష్టం చేశారు. ఇక బీమా క్లెయిముల కోసం తప్పుడు సమాచారం ఇస్తున్నామని 54 శాతం అంగీకరించారు. కానీ 33 శాతం మంది ఈ రకమైన తీరు అస్సలు ఆమోదయోగ్యం కాదంటున్నారు. వారంతా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కాగా, 35 శాతం మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడితే తప్పేమిటన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.