న్యూఢిల్లీ, జనవరి 22: రిటైల్ రుణాల్లో అన్నింటికన్నా, క్రెడిట్ కార్డుల బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎటువంటి సెక్యూరిటీలేని ఇటువంటి రుణ బకాయిల పెరుగుదలపట్ల రిజర్వ్‌బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘రిటైల్ విభాగంలో రుణ వృద్ధి:రిస్క్, స్థిరత్వ ఆందోళనలు’అనే అంశంపై ఆర్బీఐ ఎకానమిస్టులు ఒక రీసెర్చ్ నోట్‌ను విడుదల చేస్తూ 2023 నవంబర్ చివరినాటికి క్రెడిట్ కార్డ్ రుణ బకాయిలు రూ. 2.4 లక్షల కోట్లకు చేరినట్టు వెల్లడించారు. ఈ బకాయిలు మొత్తం రిటైల్ రుణాల్లో 5 శాతం.
ఒక ఏడాదిలో ఇవి 34 శాతం పెరిగిపోయాయన్నారు. ఇందులో అధిక శాతం ఆర్థికంగా బలహీనస్థితిలో (సబ్‌ప్రైమ్)లో ఉన్న వినియోగదారులవే ఉన్నాయని, వీటి సగటు బకాయి పరిమాణం రూ. 40,000కాగా, అంతకంటే కాస్త మెరుగైన (నియర్ ప్రైమ్)వారి సగటు బకాయి పరిమాణం రూ.60,000 వరకూ ఉన్నట్టు రీసెర్చ్ నోట్ వెల్లడించింది. సబ్‌ప్రైమ్ ఖాతాదారుల బకాయిలే ఎక్కువగా ఉండటం.. రిస్కీ వినియోగదారుల చెంతకే అధిక రుణం ప్రవహిస్తున్నదనడానికి నిదర్శనమని ఎకానమిస్టులు పేర్కొన్నారు. అన్సెక్యూర్డ్ రుణాలపై బ్యాంక్‌ల రిస్క్ వెయిటేజీని రిజర్వ్‌బ్యాంక్ పెంచినప్పటికీ, క్రెడిట్ కార్డు రుణాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.
పరిమితి పెట్టాలి
క్రెడిట్ కార్డు రుణాలు, రుణ బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్‌లను తగ్గించుకోవడానికి క్రెడిట్‌కార్డు జారీ సంస్థలు టెక్నాలజీని, అకౌంట్ అగ్రిగేటర్లను ఉపయోగించుకోవడం, పటిష్ఠమైన అండర్‌రైటింగ్ తదితరాల్ని ఆర్బీఐ ప్రోత్సహిస్తున్నదని రీసెర్చ్ నోట్ పేర్కొంది. మరికొన్ని ఇతర చర్యలతో కూడా రిస్క్ తగ్గుతుందని, ముఖ్యంగా కొంతమంది రుణగ్రహీతలకు లేదా కొన్ని రకాల రుణ వినియోగాలకు పరిమితులు విధించాలని సూచించింది. అదాయానికి తగ్గ రుణ సదుపాయం లభించేలా డెట్-టు-ఇన్‌కం (డీటీఐ), పరిమితి, లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) వంటి పరిమితులు సమర్థవంతంగా ఉంటాయన్నది.