హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్ (యూపీ) తరహాలో తెలంగాణలోనూ హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్‌ను మినహాయించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. దీనివల్ల ఒక్కో కారు ఆన్‌రోడ్ ధర సుమారు రూ.2 నుంచి 3 లక్షలదాకా తగ్గే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఇక కొందరైతే యూపీ వెళ్లి కారు కొనేందుకూ ఆసక్తి చూపుతున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.10 లక్షలు ఖర్చయ్యే వాహనాలకు రోడ్ ట్యాక్స్ 12 శాతంగా ఉన్నది. ఆపై ధర పలికితే 14 శాతం వసూలు చేస్తున్నారు. మారుతీ సుజుకీ, టయోటా వంటి కంపెనీలు కొన్ని హైబ్రిడ్ మాడల్ కార్లను విక్రయిస్తున్నాయి. వీటి ధరలు రూ.10 లక్షలపైనే ఉండటంతో రోడ్ ట్యాక్స్ రూ.2-3 లక్షల వరకు ఉంటున్నది. కాగా, బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్‌తోపాటు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ల ద్వారా నడిచే అవకాశం ఉండటం ఈ హైబ్రిడ్ కార్ల ప్రత్యేకత. దీనివల్ల మైలేజీ ఎక్కువగా ఉండటమేగాక, కాలుష్యం కూడా తక్కువగా ఉంటున్నది.
అందుకే యూపీ సర్కారు ఈ నెల 1 నుంచి హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్‌ను తొలగించింది. దీంతో అక్కడ హైబ్రిడ్ కార్ల విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీకి దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడాలోనైతే నెలనెలా పెద్ద ఎత్తున అమ్మకాలు నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్లు 50 శాతానికి పెరిగినట్టు వాహన పరిశ్రమ ప్రతినిధులూ చెప్తున్నారు.
ఈవీ విక్రయాల్లో..
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యే తొలి 5,000 విద్యుత్తు ఆధారిత (ఈవీ) కార్లకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునిచ్చారు. కానీ ఈ సంఖ్య ఎప్పుడో దాటిపోయింది. దీంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకూ మామూలుగానే రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఈవీల రిజిస్ట్రేషన్‌పై పన్ను మినహాయింపు ఉండటంతో చాలామంది అక్కడ కార్లను కొనుగోలు చేస్తున్నట్టు ఆటో ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణలోనూ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించాలని కోరుతున్నారు. దీనివల్ల కాలుష్యం గణనీయంగా తగ్గడమేగాక, వాహన విక్రయాలూ పెరుగుతాయంటున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.