న్యూఢిల్లీ, జూలై 18: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు హయాంలో రూపాయి విలువ 25 శాతం క్షీణించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2014 డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది జూలై 11 వరకు దాదాపు 25 శాతం పతనమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో తెలియజేశారు. 2014 డిసెంబర్ 31న రూపాయి మారకం విలువ 63.33గా ఉన్నది. అయితే ఈ ఏడాది జూలై 11న 79.41గా నమోదైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం ఓ లిఖితపూర్వక సమాధానంలో మంత్రి చెప్పారు.
తొలిసారిగా 80 స్థాయికి..
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి నిలబడలేకపోతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌లో మళ్లీ దిగజారింది. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా 80 స్థాయిని తాకడం గమనార్హం. ఇంట్రా-డేలో 80.2కు పతనమైంది. గత గురువారం ఆల్‌టైమ్ రికార్డు కనిష్ఠ స్థాయిలో 79.99 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం తిరిగి 17 పైసలు కోలుకోగా.. సోమవారం 16 పైసలు పడిపోయింది. దీంతో 79.98 వద్ద నిలిచింది. రూపీ క్షీణత ఆందోళనకరంగా ఉండటంతో ఆర్బీఐ సైతం చర్యలు చేపడుతున్నది. అయినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఇంకోవైపు దేశంలో డాలర్ నిల్వలూ అంతకంతకూ తరిగిపోతున్నాయి. మొత్తానికి ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న వేళ రూపాయి తీరు మరిన్ని కష్టాలకు దారితీస్తున్నది.