Adani Group | యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg research report) వెల్లడైనప్పటి నుంచి అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ (Adani group of companies shares)అమ్మకాల ఒత్తిడినెదుర్కొంటున్నాయి. పన్ను స్వర్గధామ దేశాలు కేంద్రంగా స్టాక్స్ అవకతవకలకు పాల్పడ్డారని, అకౌంటింగ్లో మోసాలకు పాల్పడ్డారని అదానీ గ్రూప్‌పై గత నెల 24న హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. నాటి నుంచి ప్రతి రోజూ అదానీ గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీలు సగటున రూ.52,343 కోట్ల చొప్పున మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. కేవలం నెల రోజుల్లో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.2 లక్షల కోట్ల నుంచి రూ.12.05 లక్షల కోట్లు (145 బిలియన్ డాలర్లు) అంటే 63 శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా ఒక పారిశ్రామిక గ్రూప్ సంస్థలు నెల రోజుల్లో అత్యధికంగా నష్టపోవడం ఇదే ప్రథం అని తెలుస్తున్నది.
గత నెల 24 నుంచి కేవలం 23 ట్రేడింగ్ సెషన్లలోనే ప్రపంచ కుబేరుల సూచీలో గౌతం అదానీ నాలుగో స్థానం నుంచి 29వ ర్యాంక్‌కు పడిపోయారు. గత నెల రోజుల్లో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 80 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది. టాటా సన్స్, రిలయన్స్, రాహుల్ బజాజ్ గ్రూప్ తర్వాత రూ.7.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో నాలుగో స్థానంలో అదానీ గ్రూప్ నిలిచింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించక ముందు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా సన్స్ తర్వాత స్థానంలో అదానీ గ్రూప్ నిలిచింది. అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనంతో భారత లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.20.4 లక్షల కోట్లు ఆవిరై రూ.280.4 లక్షల కోట్ల నుంచి రూ.260 లక్షల కోట్లకు దిగి వచ్చింది. వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారత్ ర్యాంక్ ఐదో ర్యాంక్ నుంచి ఏడో ర్యాంక్ పడిపోయింది.