న్యూఢిల్లీ, జూన్ 16: దేశవ్యాప్తంగా 5జీ వినియోగదారులు వాయువేగంతో దూసుకుపోతున్నారు. 2031 నాటికి 5జీ సబ్స్క్రిప్షన్ 110 కోట్లకు చేరుకోనున్నట్లు స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న టెలికాం సేవల్లో 81 శాతం మంది 5జీ సేవలు వినియోగించనున్నట్టు పేర్కొంది. గతేడాది చివరినాటికి దేశీయంగా 43 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉండగా, మొత్తం వినియోగదారుల్లో వీరివాటా 35 శాతంగా ఉన్నదని తెలిపింది. అలాగే డాటా వినిమయం రెండింతలు పెరగనున్నదని వెల్లడించింది.
ప్రస్తుతం నెలకు 37 జీబీల డాటాను వినియోగిస్తున్న మొబైల్ వినియోగదారులు 2031 నాటికి 70 జీబీలకు చేరుకోనున్నదని అంచనా. దేశవ్యాప్తంగా తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్లు లభించనుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ప్రస్తుతం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న 4జీ సబ్‌స్ర్కైబర్లు 2031 నాటికి భారీగా పడిపోనున్నట్టు నివేదిక వెల్లడించింది. 2025లో 57 కోట్ల మంది 4జీ వినియోగదారులు ఉండగా, 2031 నాటికి 16 కోట్లకు తగ్గనున్నారని అంచనావేస్తున్నది.
ఈ సందర్భంగా ఎరిక్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సల్ మాట్లాడుతూ..భారత్‌లో 5జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరణ వేగవంతంగా దూసుకుపోతున్నదని, 5జీ మౌలిక సదుపాయాలకు టెలికాం సంస్థలు పెద్దపీట వేయడం, డిజిటల్ ఇండియాలో భాగంగా పరిశోధనా రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు కారణమైందన్నారు.