5G Spectrum | మూడు రోజులుగా సాగిన 16 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,49,623 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ శుక్రవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. గురువారం వరుసగా మూడో రోజు బిడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వానికి 1,49,625 కోట్ల ఆదాయం లభించిందన్నారు. టెలికం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోకి సేవలను తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
5జీ వేలంలో భాగంగా కేంద్రం 72హెర్ట్్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రాన్ని వేలంలో పెట్టింది. రిలయన్స్ జియోతోపాటు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతోపాటు అదానీ గ్రూప్ 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొంటున్నాయి. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో అత్యధిక స్పెక్ట్రాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం తొలి రోజు నాలుగు రౌండ్లు, బుధవారం నాడు 5 రౌండ్లు, గురువారం ఏడు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి.
5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చేనెల 14 నాటికి ఆయా టెలికం సంస్థలకు స్పెక్ట్రం కేటాయింపులు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నది. సెప్టెంబర్ నుంచి దేశంలో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. రెండు రోజుల్లోనే ముగుస్తుందని భావించిన 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ నాలుగో రోజు వరకు పొడిగించడం గమనార్హం.