న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 16: బంగారం ధరలు పరుగుపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. గత పది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.310 అధికమై రూ. 56,700 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల కొనుగోళ్ళకు మొగ్గుచూపడంతో కిలో వెండి ఏకంగా రూ.1,200 అధికమై మళ్లీ రూ.70 వేలు పలికింది. ఇటు హైదరాబాద్‌లో బంగారం రూ.57 వేలకు చేరువైంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.210 ఎగబాకి రూ.56,950 పలికింది. 22 క్యారెట్ల ధర రూ.190 అధికమై రూ.52,200కి చేరుకున్నది. వెండి మాత్రం రూ.1,800 అధికమై రూ.75,800కి చేరింది.
గడిచిన నాలుగు రోజుల్లో బంగారం ధర వెయ్యి రూపాయలు పెరిగినట్లు అయింది. ఎంసీఎక్స్‌లో పుత్తడి ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 56,450కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల్లో ఔన్స్ గోల్డ్ 1,916 డాలర్లు పలుకగా, వెండి 24.22 డాలర్లు పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను అధికంగా పెంచే అవకాశాలు లేకపోవడంతో గోల్డ్ ధరలు తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.