హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదేండ్లలో టైర్-2 నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా టైర్-2 నగరాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అక్కడ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరమని, రానున్న రోజుల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు స్థలం కేటాయించడం, మౌలిక వసతులు కల్పించడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకూ అభివృద్ధిని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే టెక్ మహీంద్రా, మైండ్‌ట్రీ, సైయెంట్, జెన్‌ప్యాక్ట్ సంస్థలు వరంగల్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఐదేండ్లలో టైర్-2 నగరాల్లో 50వేల ఉద్యోగావకాశాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మాస్‌మ్యూచువల్ ఇండియా.. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్‌మ్యూచువల్ కూడా తమ కార్యాలయాలను టైర్-2 నగరాలకు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం కీలకంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేండ్లుగా నెలకొన్న అనిశ్చితి, కరోనా కారణంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యంగా బీమా రంగానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ బీఎఫ్ఎస్ఐ రంగంలో మాస్‌మ్యూచువల్ కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. మాస్మ్యూచువల్తో నగరంలో టాప్ ఫార్చ్యూన్ 100 కంపెనీల జాబితాలో మరో అమెరికా కంపెనీ చేరిందన్నారు. నిజానికి గతేడాది జనవరిలోనే ఈ సెంటర్‌ను ప్రారంభించాలనే చర్చ మొదలైందన్న కేటీఆర్.. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్‌లో కార్యాలయాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్న ఆ సంస్థ గ్లోబల్ లీడర్ షిప్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మెన్, తెలంగాణ ఐటీ, పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మాస్‌మ్యూచువల్ హెడ్ రవి తంగిరాల పాల్గొన్నారు.
‘దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబైలతో చూస్తే మౌలిక వసతుల కల్పనలో మెరుగ్గా ఉన్నాం. ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. మర్సెర్స్ ‘సిటీస్ ఆఫ్ లివిబిలిటీ ఇండెక్స్’లో భారత్‌లోని నగరాల్లో ‘బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ’గా హైదరాబాద్ నిలిచింది. నగరంలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసింగ్ వ్యవస్థ, శాంతిభద్రతలు చాలా బాగున్నాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
స్థానికతకు అధిక ప్రాధాన్యం
బీఎఫ్ఎస్ఐ రంగంలో స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని సంస్థలను కేటీఆర్ కోరారు. హైదరాబాద్ అనేది నిజమైన కాస్మోపాలిటిన్ సిటీ అన్న ఆయన.. ఎక్కడి నుంచి వచ్చినవారికైనా స్వాగతం పలుకుతుందన్నారు. కాగా, వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను మాస్‌మ్యూచువల్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సంస్థకు చెందిన ఖాజాగూడలోని కార్యాలయంలో 1,200 మంది ఉపాధి పొందుతున్నారు.