Credit Cards Benifits | ఐటీ.. బ్యాంకింగ్.. మార్కెటింగ్.. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన మిలియనిల్స్.. యువతరం ప్రారంభ దశలో సొంతంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని కోరుకుంటారు. తమ సంపాదనలో వివిధ పథకాల్లో మదుపు చేయడానికి మొగ్గు చూపుతారు. మంచి వేతన ప్యాకేజీపై ఉద్యోగంలో చేరితే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆటోమేటిక్‌గా అర్హులవుతారు. కానీ, పదేపదే రుణాలు తీసుకోవడానికి మొగ్గు చూపితే జీవిత ప్రారంభ దశలోనే మీ ఆర్థిక వనరులు దెబ్బ తింటాయి. పదేపదే క్రెడిట్ కార్డుల వినియోగంతో ఇబ్బందులున్నా వాటిని తీసుకుని వాడుకోవడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అవేమిటో చూద్దామా..!
ప్రతి ఒక్కరి కెరీర్లో ప్రారంభ దశలో వేతనం ఓ మోస్తరుగా లభిస్తుంది. ఫలితంగా యువతరం తమ కుటుంబ ఖర్చులు, పొదుపు చర్యల మధ్య నలిగిపోతుంటారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదుకునేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ఫండ్ ఆదా చేయడం వారికి సవాల్‌గా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు చేదోడుగా నిలుస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా సమయానికి మనీ పొందొచ్చు.. అలా పొందిన మొత్తం క్రెడిట్ బిల్లు.. 45 రోజుల్లో చెల్లించాలి. మీరు సరైన ప్లాన్ రూపొందించుకుంటే సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు పే చేయొచ్చు. తక్కువ మొత్తాలు పొదుపు చేస్తున్నప్పుడు కీలక సమయాల్లో సమస్యలను అధిగమించేందుకు క్రెడిట్ కార్డు మీలో విశ్వాసం పెంపొందిస్తుంది.
సాధారణంగా కుటుంబ వ్యక్తిగత ( personal finance ) అవసరాల కోసం రుణాలను ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరూ సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటారు. తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన నిధుల కోసం.. కారు కొనుగోలు చేయడానికి చాలా మంది రుణాలు తీసుకుంటుంటారు. సంబంధిత వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ వ్యయం విధి విధానాలు ఖరారవుతాయి. బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలతో తక్కువ వడ్డీకి సంప్రదింపులు జరుపడానికి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు. అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు తేలిగ్గా రుణాలు తీసుకోవడంతోపాటు తక్కువ వడ్డీరేటు వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డు పొందడంతోనే మీ క్రెడిట్ స్కోర్ నిర్మాణం మొదలవుతూ ఉంటుంది.
వివిధ సంస్థల వస్తువుల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డుల నుంచి చెల్లింపులు జరిపితే రివార్డ్ పాయింట్లు ఆఫర్ చేస్తుంటాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, వోచర్లు తదితర ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లన్నీ క్రెడిట్ కార్డు ద్వారా పొందొచ్చు. కాకపోతే డెబిట్ కార్డు లేదా నగదు చెల్లింపులకు బదులు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే సరి. పలు క్రెడిట్ కార్డులతో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్, కాంప్లిమెంటరీగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ప్రపంచ వ్యాప్తంగా గోల్ఫ్ కోర్సులు పొందవచ్చు. కనుక మీ జీవనానికి అనువైన క్రెడిట్ కార్డును ఎంచుకుంటే పలు ప్రయోజనాలు పొందొచ్చు.
ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డులు మంచి ఆర్థిక ప్రణాళిక నేర్పుతాయి. క్రెడిట్ కార్డుల వాడకంలో మంచీ చెడూ వాటి వల్ల వచ్చే నికర ప్రయోజనాలను తెలుసుకుంటే.. మీ ఆదాయ ఖర్చు తీరు తెన్నులను ఆలోచింప చేస్తాయి. బాధ్యతాయుతంగా క్రెడిట్ కార్డు వాడకం ఆర్థిక లావాదేవీల నిర్వహణను నేర్పుతుంది. సమర్థవంతంగా వ్యక్తిగత ఖర్చుల నిర్వహణ తెలుసుకోగలుగుతారు.