SEBI | న్యూఢిల్లీ, ఆగస్టు 30: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. 46 స్టాక్, కమోడిటీ బ్రోకరేజీ సంస్థలపై కొరడా ఝుళిపించింది. నిబంధనల మేరకు లేని 39 స్టాక్ బ్రోకర్లు, 7 కమోడిటీ బ్రోకర్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను శుక్రవారం రద్దు చేసింది. అలాగే 22 డిపాజిటరీ పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్లనూ క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రిజిస్ట్రేషన్లు రైద్దెనా.. స్టాక్ లేదా కమోడిటీ బ్రోకర్లుగా, డిపాజిటరీ పార్టిసిపెంట్లుగా గతంలో తీసుకున్న చర్యలకు, వైఫల్యాలకు ఇకపైనా వారు బాధ్యులేనని వేర్వేరుగా ఇచ్చిన తాజా ఆదేశాల్లో సెబీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సెబీకి బాకీపడిన వడ్డీలు, ఫీజులు, ఇతరత్రా బకాయిలను చెల్లించాల్సిందేనన్నది.
హైదరాబాద్‌లో పీబీపార్టనర్స్ ఆఫీస్
హైదరాబాద్, ఆగస్టు 30: పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్‌కు చెందిన పీబీపార్టనర్స్.. హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు కస్టమర్ కేర్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు పీబీపార్టనర్స్ అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్ అమిత్ భదోరియా తెలిపారు. వచ్చే రెండేండ్లలో వరంగల్, కరీంనగర్‌తోపాటు వైజాగ్, తిరుపతి, కోయంబత్తూర్‌లో కార్యాలయాలను తెరువాలనుకుంటున్నట్లు చెప్పారు.
యూబీఐతో టయోటా జట్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: టయోటా కిర్లోస్కర్ వాహనాలను కొనుగోలు చేసేవారికి రుణాలు అందించాలనే ఉద్దేశంతో యూబీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా కంపెనీ వాహనాలపై 90 శాతం వరకు రుణం లభించనున్నది.