న్యూఢిల్లీ, జనవరి 1: దేశీయ ఆటో రంగ సంస్థలకు గత ఏడాది పెద్ద ఎత్తునే కలిసొచ్చింది. 2025లో ప్యాసింజర్ వెహికిల్ హోల్‌సేల్స్ 45.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడం లాభించిందని, దాదాపు 6 శాతం వృద్ధిని చూశామని ఆటో ఇండస్ట్రీ చెప్తున్నది. కాగా, 2024లో 43.05 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఇక నిరుడు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్ టొయోటా కిర్లోస్కర్ మోటర్, స్కోడా ఆటో ఇండియా వంటి సంస్థల వార్షిక అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా గత ఏడాది సేల్స్‌లో భారతీయ ఆటో సంస్థలు మహీంద్రా, టాటాలు దుమ్మురేపాయి. దీంతో దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ నాల్గో స్థానానికి దిగజారింది. మారుతీ సుజుకీ ఎప్పట్లాగే టాప్‌లో ఉన్నది. 2025లో ఎస్‌యూవీలకు గిరాకీ బాగా ఉన్నట్టు గురువారం ఇండస్ట్రీ తెలిపింది. ఇక జీఎస్టీ జోష్‌తో చిన్న కార్ల సెగ్మెంట్లో మారుతీ పరుగులు పెట్టింది.
మారుతీ సుజుకీ.. తమ చిన్న కార్ల ధరలను త్వరలోనే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ స్లాబుల సవరణతో గత ఏడాది మారుతీ సహా అన్ని సంస్థలకు చెందిన ఆయా మాడళ్ల ధరలు భారీగానే తగ్గినది తెలిసిందే. అయితే ఇప్పుడు మార్కెట్లో పోటీ సంస్థలైన హ్యుందాయ్ మరికొన్ని వాహన రేట్లను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము కూడా ధరల్ని సవరించే వీలుందని సంస్థ సీనియర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఈవో పార్థో బెనర్జీ గురువారం మీడియాకు సంకేతాలిచ్చారు.
