హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికరంగానికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఇప్పటికే సబ్సిడీలకోసం రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సివుండగా..2025-26 బడ్జెట్లో పరిశ్రమల శాఖకు రూ.3,527 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటిలో మూడో వంతు సబ్సిడీలకే చెల్లించాల్సి వుంటుంది. దీంతో పేరుకుపోయిన బకాయిలు విడుదలవుతాయో, లేదో అనే సందేహాలు పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వీటితోపాటు అనేక కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం విశేషం.
తాజా బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్య శాఖకు ఎస్టాబ్లిష్మెంట్ పద్దు కింద రూ.115 కోట్లు, స్కీమ్‌లకు రూ.3,783 కోట్లు కలిపి మొత్తం రూ.3,527 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రోత్సాహకాలకు రూ.1,730 కోట్లు, గ్రామీణ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.1,049.50 కోట్లు, మూలధన పనులకు రూ.371 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.137.5 కోట్లు ప్రతిపాదించింది. వచ్చే ఐదేండ్లలో రూ.4,000 కోట్లతో 25 వేలకుపైగా కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుచేస్తామని, ఇందులో యాంటీ బయోటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.
పారిశ్రామిక వికేంద్రీకరణే లక్ష్యంగా 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే ఉద్దేశంతో మెగా మాస్టర్‌ప్లాన్-2050ని రూపొందించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఫుడ్‌ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్‌వేర్, చేనేత, ఆభరణాలు తదితర క్లస్టర్లను ఏర్పాటుచేసి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఎన్‌హెచ్-163కి ఇరువైపులా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూసేకరణ సమస్యగా మారింది. భూసేకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం అసైన్డ్భూములు, పచ్చని పంట పొలాలను పారిశ్రామికవాడలుగా మార్చేందుకు వరుస నోటిఫికేషన్లను జారీచేస్తున్నప్పటికీ, రైతులు మాత్రం తమ భూము లు వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు.