న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. ఒకవైపు ఇంధన ధరలు భారీగా పుంజుకోనుండగా, మరోవైపు కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా ఈవీలపై ఫోకస్ పెడుతున్నారు. దీంతో గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న ఈవీ ప్యాసింజర్ వాహనాలు గత నెలలోనూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో 23,506 యూనిట్ల ఎలక్ట్రిక్ పీవీ వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో అమ్ముడైన 13,421 యూనిట్లతో పోలిస్తే 75.14 శాతం అధికమని పేర్కొంది. గడిచిన నెలలో టాటా మోటర్స్ ప్యాసింజర్ సంస్థ 8,543 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కిందటేడాది ఇదే నెలలో అమ్ముడైన 4,822 యూనిట్ల కంటే ఇది 77.17 శాతం అధికమని పేర్కొంది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 5,413 యూనిట్ల ఈవీలను సేల్ చేసింది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ 5 వేల యూనిట్ల కార్లను దేశీయంగా విక్రయించింది.
కార్లతోపాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గత నెలలో ఏకంగా 1,48,740 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయని ఫాడా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 92,538 యూనిట్లతో పోలిస్తే 60 శాతం అధికమని పేర్కొంది. వీటిలో టీవీఎస్ మోటర్ కంపెనీ 37,683 యూనిట్ల వాహనాలను విక్రయించగా, బజాజ్ ఆటో 32,898 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 27,034 యూనిట్లు వాహనాలను విక్రయించా యి. అలాగే 64,549 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు అమ్ముడవగా, ఎలక్ట్రిక్ కమర్షియ ల్ వాహనాలు రెండింతలు పెరిగి 2,245 యూనిట్లకు చేరుకున్నాయి.